24, ఆగస్టు 2016, బుధవారం

పద్మావతీ శ్రీనివాసము

పద్మావతీ శ్రీనివాసము

ప్రథమాశ్వాసము

 

                             శ్రీకైవల్యానుగ్రహ | లోక సురక్షక సుధా విలోకన రమణా

                             శోక దురితౌఘ దళనా | కాకుత్స్థ కులాభిరామ కారుణ్య నిధీ      1

 

 

 

శ్రీనివాస చరణ సేవానురక్తి

మానుగ నిత్యము మనమందు నిల్పి

2.     

కలియుగ దైవమై కరమను రక్తి

వెలసిన కథ నుడివెద ముదమార

3.     

 

అంజనాద్రి ఘన శేషాద్రి వృషాద్రి

మంజుల వృషభాద్రి మఱి గరుడాద్రి  

4.     

నారాయణాద్రి యనఁగ వేంకటాద్రి

నా రంజిలెడు సప్త నగరాజ విభుని

5.     

 

మానసంబున నిల్పి మాధుర్యముగను

వీనుల విందుగ వివరంబు గాను    

6.     

పద్మావతీశ్రీనివాస మనంగ

పద్మదళాక్షు భవ్యచరిత్ర నెల్ల

7.     

 

శ్రీయుతమై ముని సేవితమై ఘ

నాయతమై జగదభి రామమైన

8.     

నైమిశారణ్యమ్ము నంద నోపమము

హేమాది ధాతు సంహితములు గిరులు

9.     

 

సాల తాల తమాల చంపక కుంద

మాలతీ కరవీర మల్లికాషండ       

10.   

చూత నీప వకుళాశోక మధూక

కేతక మాధవీ కింశుక తినిశ

11.    

 

కురవక పాటలా కోవిదా రాది

తరువులు విలసిల్లు ధరణీ తలమ్ము

12.   

రమణీయ ఖగములు రంజిల్లు నచట

కమనీయ కుట్టార కందరా వృతము

13.   

 

హరిణ చమూరు శివాజగర హరి

శరభ శార్దూల కేసరి గజాది మృగ   

14.   

సంచరితమ్ము కాసార సాధుజల

సంచయమ్ము తనర షట్పద రవము

15.   

 

కలహంస బక గణ కారండ వాది

జల విహంగోత్కర సంసేవి తమ్ము

16.   

పుణ్యపు నైమిశమ్మున తపోధను ల

గణ్య సంఖ్యులు ప్రముఖ ధరణి సురులు

17.   

 

సంతత నిశ్చల జపతపః కామి

తాంతరంగులు జ్వలితాంగులు ఘనులు      

18.   

సకలోర్వి జనులకు సౌఖ్యంబు నెంచి

యకళంక చరితులు యమివరు లెల్ల

19.   

 

యజ్ఞరాజ మొకటి యాచరించు తఱి

సుజ్ఞాన సంపన్న సురమునీంద్రుండు

20.  

నారాయ నాంచిత నామ జప మహి

తారాధనా రతుఁ డబ్జ జాత్మజుఁడు

21.   

 

నారదుం డత్తఱి నగుమోము తోడ

వారి కడకు వచ్చె భాగవతుండు

22.  

సురమునిఁ జూచి భూసురులు సమ్మోద

భరితులునై యర్ఘ్యపాద్యంబు లొసఁగి

23.  

 

అంజలి ఘటియించి యాసీనుఁ జేసి

వింజామరలు వీచి వినుతుల తోడ

24.  

పూజింప నానంద పులకితుఁ డయ్యె

రాజీవగర్భు వర సుతుండు కరము   

25.  

 

బృందారక గణ సంప్రీత చిత్తుండు

మందస్మిత వదన మండితుఁ డడిగె

26.  

యాగ భాగ చయార్హ తాధిపుఁ డెవరు

భాగవ తోత్తమ పండితు లార

27.  

 

ఈ చెంత మీ యాగ మెవ్వాని గూర్చి

వాచోచితమ్ములఁ బలుకంగ రాదె

28.  

నా విని సంయమి నాథులు చింత

నా వివశత్వమ్మున నిలిచి రంత

29.  

 

ధర్మ తత్వజ్ఞులు దమలోనఁ దాము

మర్మ మెఱుఁగ నెంచి మథియించి రిట్లు

30.  

అంభోజ గర్భాచ్యుతాంబ రాంబరుల

దంభ విహీనుఁడు దా నెవ్వఁ డనుచు

31.   

 

శాంత మక్రోధము క్షమముల నెవరు

సంతత ముందురు సక్కఁగ ననుచు

32.  

తర్కంబు సేసిరి ధరణిసుర వరు

లర్క సదృశ తేజు లన్యోన్య మంత

33.  

 

అమర ముని వరేణ్య యట్టి యీశుండు

తమ రర్హులు దెలుప దయ మాకు ననఁగ

34.  

లోకకల్యాణ లోలుఁ డనియె నిట్లు

నాకముని కనుఁ డనఘులార మీర

35.  

 

అనినంత శుకశౌన కాదిగ మునులు

గని రొండొరుల గనఁ గార్య సాధకుని

36.  

పరమ పవిత్రుఁడు పాదాక్ష భృగు వ

డరెను శోధింప నటన్ సత్వ గుణుని

37.  

 

అల్ప కార్యం బని యాత్మలోఁ దలఁచి

చల్పెను మార్గణ సాహస యాత్ర

38.  

కాంచెను సత్యలోకమునఁ బద్మభవు

నంచిత వాణీ సమాశ్రిత లీలు

39.  

 

నిజగురు ద్రుహిణుని నిలిచె మౌనముగ

నజుఁ గని వందన మాచ  రింపకయె

40.  

అవిధేయ మునిఁ గని యాగ్రహ మొందె

ను విరించి తనయుఁ డనుచు శాంతుఁ డయ్యె

41.   

 

ధాత నిజ జనకు తాపముఁ జూచి

వీత సంభావన వెడలె భూసురుఁడు

42.  

హిమగిరి తదుపరి యేఁగెను ధృతిని

ప్రమథాధిపతిఁ జూడఁ బౌరుష మొప్ప

43.  

 

కనియెం భృగు మహర్షి గరళోగ్ర కంఠు

ననలాంబకు గిరీశు నంగజ హరుని

44.  

భృగుఁ గని సోదరప్రేమ మూర్కొనఁగఁ

దగ నెదురేఁగె నథర్వుఁడు నంత

45.  

 

అల సత్వ గుణము దా నరయ దలంచి

యలసత్వమున నుండె నంత భూసురుఁడు

46.  

ద్విజు వర్తనముఁ గని తీవ్ర రోషమున

నజుఁడు శూలం బేయ నడర నాపె నుమ 

47.  

 

రోషాకలిత వేషు రుద్రునిఁ జూచి

భాషా విహీనుఁడై పరఁగె ద్విజుండు   

48.  

శీఘ్ర కోపోద్రిక్త చేతస్కుఁ గాంచి

శీఘ్రమ మరలెను శీతాద్రి నతఁడు

49.  

 

కలియుగ కల్యాణ కాంక్షిత మతులు

నలిననాభసుతు పినాకి లీల లవి

50.  

శ్రాంతాపగతుఁడును సంయమి వరుఁడు

చింతాకులిత తప్త చేతస్కుఁ డయ్యె

51.   

 

చనిచని కాంచెను సంయ మీద్రుండు

వనజాక్ష విలసిత వైకుంఠమునను

52.  

వైకుంఠ పురవాసు వందిత శక్రు

లోకైక రక్షకు రుచి రాంతరంగు

53.  

 

ఘన నీలి వర్ణునిఁ గౌస్తు భాభరణు

ఘన చక్ర హస్తునిఁ గౌశేయ వస్త్రు

54.  

హర్యక్ష నిభమధ్యు నఖిలాండ నాథుఁ

బర్యంక ఫణిరాజు పద్మాయ తాక్షు

55.  

 

సురగణ సేవితు సుంద రాకారు                 

హరిని రమా వినో ద్యచ్యు తానంతు

56.  

కని గుణ శోధన కాంక్ష మీఱంగ

ఘనవామ పాద విఘాతోరుఁ జేసె

57.  

 

లక్ష్మీ నివాసస్థలం బది నేఁడు

సూక్ష్మీకృతం బయ్యెఁ జోద్యముగఁ ద్రుటి

58.  

పరమాత్మ గుణగణ పరిశోధన ముని

వరునకుఁ దగునెట్లు వర గర్వ మకట

59.  

 

భాగవ తోత్తమ పావన గాథ

లీ గతి వింతలు హితకరములును

60.  

దరహాస వదనుఁడై తాపసిఁ జేరి

హరి శాంతుఁ జేసి ప్రేమాతిశయమున

61.   

 

పలికెను భవదీయ పదము నా దయిన

పలుసంపు రొమ్మునఁ బడి కందె నేమొ

62.  

శాంతింపు మయ్య విశ్రాంతి నిచ్చోట

సుంత యేమఱచితిఁ జూడ నే నిన్ను

63.  

 

మధుసూద నాస్య సుమధుర భాషల న

వధరించి ముద మొందె భట్టారకుండు

64.  

అగ్నిముఖుని గర్వ మణఁప నెంచి హరి

భగ్న పాదాక్షుగ వానిఁ జేసె నిఁక

65.  

 

ముక్తాతిశయ ఘన ముదితాంతరంగ

భక్త శిఖామణి పద్మాక్షుఁ గొలిచె

66.  

భక్తవత్సల లోకపాల పరాత్మ

ముక్తిప్రదాయకా మోహనరూప

67.  

 

ఆది మధ్యాంతము లరయంగ లేము

నీదు లీలలు మేము నేరంగ లేము

68.  

పరిపరి విధములఁ బ్రార్ధించి విప్రుఁ

డరిగె నామంత్రణ మంది ముదముగ            

69.  

 

యజ్ఞవాటిక కేఁగి యమి వరులఁ గని

యజ్ఞాధిపుఁడు విష్ణు వని తెల్పె నంత

70.  

 

శ్రీనివాసామర సేవిత దేవ                        

మాననీయ నవ కమలదళ నయన

71.   


 

 

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత

వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

పద్మావతీ శ్రీనివాసమునఁ బ్రథమాశ్వాసము.

 


పద్మావతీ శ్రీనివాసము

ద్వితీయాశ్వాసము

                            

                             శ్రీలక్ష్మీ ప్రాణాధిప | కాళీయ ఫణాగ్ర నర్తక గరుడ గమనా

                             లీలా మానుష వేషా | వేలాక్రాంత కరుణాబ్ధి విశ్వాధారా!  1

                             

 

 

శ్రీసతి యంత నిశ్చేష్టిత యయ్యె

యీ సంఘటనఁ గాంచి హీనాంగ రుచుల

2.     

హరి లోకనాథుని నసుర సంహారు

ధరణి సురుండు దాఁ దన్నుట యేమి

3.     

 

శంఖ సుదర్శన చక్రాయుధుండు

శృంఖలా బద్ధుఁ జేసిన రీతి నుండె

4.     

సుప్రభాత నుతుల శోభిల్లు హరిని

విప్రార్భకుఁడు నేఁడు వేధించె నకట              

5.     

 

కౌస్తు భాభరణంపుఁ గాంతుల వెలుఁగు

విస్తీర్ణ వక్షము వెలవెలఁ బాఱె

6.     

బ్రహ్మాది వేల్పుల ప్రణతుల నందు               

బ్రహ్మనాభుఁడు గాంచెఁ బాద తాడనము

7.     

 

రోషము వీడి విరోధిఁ గాచెఁ బతి

దూషిత మయ్యె నాదు నిలయ మింక     

8.     

కించపఱుప  నేల కినుక వహింప

వించుక ప్రశ్నించె నివ్విధి లక్ష్మి                  

9.     

 

దుఃఖ పూరిత యైన తోయజనేత్ర

దుఃఖ మణఁపఁగ మృదువుగఁ బల్కె హరి       

10.   

పరమేష్ఠి పుత్రుండు పరమ పావనుఁడు

గురు తపోధనుఁడు సుగుణ భాసితుండు        

11.    

 

భక్తుఁడు సంయమి భాగవతుండు

శక్తి నరయ వచ్చె సత్కార్య రతుఁడు

12.   

ధూర్తుఁ డనఁగ రాదు దురితుండు గాఁడు

వర్తించె నల్ప గర్వంబున నతఁడు

13.   

 

దర్ప మడఁచితి వే తఱిగి పాదాక్షి

దర్పహీనుఁ గరుణఁ దనుప నేరంబ?

14.   

మన్నన కర్హుండు మాననీయుండు

పన్నుగ క్షమియింపు పద్మదళాక్షి

15.   

 

మృదువైన శ్రీహరి మినుకుల సుంత

సుదతికి నుపశాంతి చొప్పడ లేదు

16.   

నా విని శ్రీలక్ష్మి నాథున కనియెఁ

గావలుండు ఘనాపకారి యీ ద్విజుఁడు         

17.   

 

ఘనుఁ డైన ముని యైన ఖదిరుండు నైన

వినయంబు లేకున్నఁ బెద్ద యెట్లౌను

18.   

దైత్యారి దూషింప దండ నార్హుండు

కృత్యాపరాధంబుఁ గీర్తింప నేల

19.   

 

శ్రీపత్యురమ్ము లక్ష్మీ నివాసమ్ముఁ               

బాపకర్ముని వామ పాదంబు తాఁకె

20.  

రోషానలమున నరుణ మయ్యె ముఖము

ద్వేషాగ్ని రగిలెను దేహంబు రమకు

21.   

 

ఘోరావమానంబు కోపిష్ఠి సాధు

వీ రీతిఁ జేసిన నెట్లోర్తు నేను

22.  

పల్కి యివ్విధమునఁ బ్రాణేశు తోడఁ

గల్కి కోపోద్రిక్త గద్గదంబుగను

23.  

 

శోకోపహత చిత్త శోషిత గాత్ర

వైకుంఠమును వీడి వనజాక్షి వెడలె

24.  

శశి విహీన ఘన నిశా నభో నిభము

భృశ తిమి రావృత విష్ణు లోకమ్ము

25.  

 

నిస్తామరస పద్మనికరంబు వోలె

నిస్తారక శశాంకు నిలయంబు వోలె

26.  

ద్యుతి విహీన దిననాథుఁ బగిది నిపుడు

గత వైభ వాస్పద ఖర వికుంఠమ్ము

27.  

 

ధవళాబ్ధి నందన దందహ్య మాన

వివశాత్మ శీతాద్రి  వేదన నేఁగె

28.  

మౌన వ్రతము వూని మాధవి శైల

కాననమ్ముల నుండె ఘన తపో నిరతి          

29.  

 

శ్రీ రిక్త నిలయంబు శ్రీహరి నంత

దారుణంబై శోక తప్తునిఁ జేసె

30.  

వాసవాది దివిజవ్రాతము కరము 

ధ్యాస నుడిగి యచేతన మయ్యె నంత        

31.   

 

శ్రీ విహీనార్తు నాశ్రిత పోషుఁ బరమ

పావను నచ్యుతు భక్త మందారు

32.  

నిష్కళ వదనుని నిస్సత్వ గాత్రు

నిష్కళంక చరిత్రు నిరవద్యుఁ గాంచి       

33.  

 

వైకుంఠ పట్టణ వాసు లెల్లరును

వ్యాకులి తాత్ములు నతి ఖిన్నులైరి

34.  

క్రీడాద్రి వీడిన క్షీరాబ్ధి తనయ 

వ్రీడావతిఁ దలఁచి పీతాంబరుండు

35.  

 

కరుణార్ద్ర మానస కమలాయ తాక్షి

పరమోద్ధ తాగ్రహ పరితప్త యయ్యె              

36.  

నను వీడి తా నేఁగె నళినాక్షి కినుక   

మనమునఁ జింతించె మాధవుఁ డంత

37.  

 

ధవళానుగత యైన తర్ణంబు వోలెఁ

గువలయాక్షినిఁ గన గోవిందుఁ డేఁగె    

38.  

చనిచని కాంచె విశాల శైలమ్ము

ఘన గృహా నిర్దర కందరా వృతము

39.  

 

వేంకటాచల మన విఖ్యాత మవని

సంకట హరణమ్ము సన్నుత స్థలము

40.  

శ్వేత వరాహమ్ము వేంచేసి నట్టి

భూతల స్వర్గంబు పుణ్య తటమ్ము

41.   

 

శైల రాజముఁ గని చక్రాయుధుండు

కాల గతస్మృతిఁ గాంచె మనమున        

42.  

శ్వేత యజ్ఞ వరాహ వేష ధారి నయి

పాతాలమున వధింపఁగ హిరణ్యాక్షు

43.  

 

మోద మొందె విధాత ముల్లోకములును

భూదేవి నిల్పిన భోగి భోగమున

44.  

పూర్వ విధంబునఁ బుడమి నమర్చి

సర్వ జలధులను సప్త లోకముల

45.  

 

విభజించి చక్కఁగ వేడితి నీర

జ భవుని సృజియింప జగతి నింపుగను

46.  

లోక కల్యాణ విలోలుఁడ వాస

సౌకర్య దివ్యదేశము భువి నెంచి

47.  

 

క్రీడాద్రి వైకుంఠ గిరిరాజు నేఁగి

తోడ గరుత్మంతుఁ దొడరి దెమ్మంటి

48.  

పరిజన సహిత విష్వక్సేన ముఖ ఖ

చర సురముని గణ సంయుత ముగను

49.  

 

నాదు మాట విని వినతి నందనుండు

మోదాతి సంభ్రమముల నుద్గ మించె

50.  

దేవ గంధర్వ విధి సహి తాదిత్య

దేవదేవాదు లేతెంచి రచటకు

51.   

 

స్తుతియించి యచ్యుతు దుర్బల నరుల

కతి భయంకర రూప మయ్య యిద్దాని

52.  

విడనాడి సుందర వేషము దాల్చి

పుడమి జనులఁ బ్రోవుము మురారి యనిరి

53.  

 

మాననీయుల మాట మన్నించి యంటి

నేను గల్పాంతము నిందుందు ననుచు

54.  

గోమతీ నది కంతకు దిశ నరువది

యామడ లాంతర మందునఁ బరఁగి

55.  

 

పూర్వాబ్ధి పశ్చిమమునఁ బంచ యోజ

నోర్వి స్థలమ్మున నుంటిని నిలిచి

56.  

అంత విక్షేప పక్షానిల ఘోష

మంతక ఘన నినా దాకృతిఁ దాల్ప

57.  

 

నానా మృగ వ్యాళ నానా విహంగ

నానా లతా ద్రుమ నద నదీ నగము

58.  

బహు నిర్ఝరాకీర్ణ భాసిత సురుచి

ర హృద యాహ్లాదకర నగ రాజమ్ము

59.  

 

యోజన త్రయమును యోజన త్రిదశ

భాజన విస్తార వసుధా ధరంబు

60.  

నారాయణాద్రి యన ఘన క్రీడాద్రి

పారంగ తాశ్రిత పరమ ధామంబు

61.   

 

శేష శయన వశ సేవిత జనము

శేష రూపము గిరిశ్రేష్ఠ తమంబు

62.  

స్కందమున నునిచి సంతస మొప్ప

డెందమునం దక్కిటి కడ కేతెంచె

63.  

 

విహగేశ్వరుండు పవిత్రాద్రి నాదు

విహితమ్మున నునిచె వినయమ్ము తోడ

64.  

హరి వరాహుఁడు గిరి నధిరోహి యయి య

పరదిశ కానన స్వామి పుష్కరణి

65.  

 

దక్షిణ భాగస్థిత తటి మధ్య మహ

దక్షయ భూరి సౌధ మమల సితము

66.  

రత్న ఖచిత గోపుర మయంబు నభ్ర

రత్నకోటి సదృశ రశ్మి రాజితము

67.  

 

శ్రీమణి మండప శ్రేష్ఠ సంయుతము

నా మహా హర్మ్యము నందు నిత్యంబు

68.  

శ్రీభూ సతులఁ గూడి శేషాద్రిని సక

లాభీష్టములు దీర్తు నఖిల భక్తులకు

69.  

 

ఆర్తి జనుల కెల్ల నానందము నొన

గూర్తును గోచరా గోచర ముగను.

70.  

మంజుల ధవళ రోమసము గావ  ధర

రంజిల్లె శ్వేత వరాహ కల్పమని

71.   

 

సప్తగిరి నివాస సన్నుత దేవ

తప్త కాంచన భూషిత విరాజమాన

72.  



ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత

వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

పద్మావతీ శ్రీనివాసమున  ద్వితీయాశ్వాసము

 

  

పద్మావతీ శ్రీనివాసము

తృతీయాశ్వాసము

 

                             శ్రీవేంకటాచలపతీ! | సేవిత సురమునిగణా! విశేష గుణనిధీ!

                             గోవిం దానం తాచ్యుత! | పావన తమ భక్త కోటి పాలన దక్షా!      1

                                                                

 

పన్నుగఁ గల్పాది భవ్య కార్యమ్ము

లన్ని దలంచి శ్రీహరి శాంతుఁ డయ్యె

2.     

ప్రాణ నాథుని మనోభావ తరంగ

వీణాస్వన సమ నిబిడ ఘోషము విని

3.     

 

మోద మలర మది మురహరి చెంత

వేదవతిఁ దలచి వేంచేసె లక్ష్మి

4.     

సామాన్యముగఁ దోఁచు సర్వ జనులకుఁ  

బ్రేమాస్పదమ్ము శ్రీవేంక టాచలము

5.     

 

పరఁగు నీ స్థలమున భక్తి భావమ్ము

నరు లెల్లరకును మానసమున నెపుడు

6.     

అందంద శ్రీ వేంకటాచల మందు

డెంద మలరఁగ నుండెఁ బరాత్పరుండు

7.     

 

గోచ రాగోచర గుంభనమ్ముగను

దోఁచు నెల్లరకును దోయజాక్షుండు

8.     

మానిత ద్విదశాష్టమ కలి యుగమున

భాను తేజుఁడు మిత్రవర్మ నాఁ బరఁగె

9.     

 

తేజంపుఁ దుండీర దివ్య మండలము

రాజధాని యట నారాయణ పురము

10.   

చంద్ర వంశోద్భవ సార్వభౌముండు

సాంద్ర యశోనిధి సద్గుణ రాశి

11.    

 

జవరాలు పాండ్యరాజ సుత మనో ర

మ వర నామా ర్ధాంగి మహనీయునకును

12.   

ఆకాశరా జన నా దంపతులకుఁ  

బ్రాకట గుణశీలి బాలుండు కలిగె

13.   

 

రాజ్యాభిషిక్తుఁ డై రమ్యముగ నవి

భాజ్యమై పాలించెఁ బార్థివాత్మజుఁడు

14.   

సంతాన రహితుం డశాంతుఁడు విభుఁడు

నింతి ధరణి వారి కెట్టి శాపమ్మొ

15.   

 

యజ్ఞార్థి  కాంచన హల మూని చేతఁ

బ్రజ్ఞానిధి కృషి యారణి తటిఁ జేయ       

16.   

బీజములు భువిని వెదచల్లు చుండ

యాజన స్థలమున నా ధరణి పతి

17.   

 

పద్మదళ నివహ భాసిత శయన

పద్మ సన్నిభ మార్దవ శిశువుఁ గాంచె     

18.   

విస్మయానంద వివృత హృదయుండు

విస్మరించి హలముఁ బ్రియ బాలఁ గొనియె

19.   

 

పసిపాపఁ గొనిపోయి భార్య కొసంగె

వసుమతీశుం డంతఁ బరితోషణమున

20.  

భామను బెంచిరి పద్మావతి యను

నామంబున శయన నళినాళి యగుడు

21.   

 

బాలి కావతరణ ఫల మోమొ కలిగె

బాలుఁ డిమ్ముగ రాజ పత్నికి నంత

22.  

గ్రహములై దున్నత రాసుల నుండ

గ్రహరాజు శుభ మేష రాశి యందుండ

23.  

 

వసుదానుఁ డను పేరు పన్నుగఁ బెట్టి

వసుధేశుఁ డొనరించె వడుగు సుతునకు

24.  

విలువిద్య నేర్చెను పితరుని వద్ద

నలవోకగను సకలాస్త్ర శస్త్రములు

25.  

 

బలశాలి పుత్రుని ప్రాభవమున న

తులిత శౌర్యుఁడు శత్రు దుర్ధర్షుఁ డయ్యె

26.  

జననీ జనకుల నిజ కరుణ గరిమఁ

దనయ పద్మావతి తనరారు చుండె

27.  

 

శుక్ల పక్ష శశాంక శోభంపుఁ గరణి

నక్లేశ వర్ధ మానైశ్వర్య యాయె

28.  

శశి నిభానన శంఖసమకంఠ చారు

కృశమధ్య ఘననీలి కేశ రంభోరు

29.  

 

చారుశీల మృదుభాష చతురాతి సుకు

మార శరీర పద్మావతీ దేవి

30.  

ఉద్యాన వనమున నొకనాఁడు తరుణి

హృద్యంబుగ సఖీ సహితయై చను తఱి

31.   

 

అమర ముని జగ దవ్యయ కారకుండు

కమలనాభ చరిత గాన లోలుండు

32.  

నారదుం డేతెంచి నారీ లలామ

వారిజాక్షినిఁ గాంచెఁ బద్మావతి నట

33.  

 

తారల మధ్యను దారాధిపు వలెఁ

దారానన సమాశ్రిత రమణీ మణిని

34.  

సంయమీశ్వరుఁ జూచి శశిముఖి భక్తి

సంయుత వినయ సుసంభ్రమములను

35.  

 

ఎదురేఁగి వందన మింపుగఁ జేసి

వదనము నించుక వంచి నిలబడె        

36.  

బాల నీవెవ్వరి బాలిక వనిన

నా లలితాంగి తా నాకాశ రాజ

37.  

 

తనయ మునివర పద్మావతి ననియె

వినయమ్ము తోడ నావిని సంతసించి

38.  

కల్యాణ మస్తని కరము దీవించెఁ

గల్యాణి నంత సకల శుభ కరుఁడు

39.  

 

తరలాక్షి శుభలక్షిత వర గాత్రమ్ము

దరహాస మాన వదన కమలమ్ము

40.  

భాసిత శంఖ గ్రీవము సుమధ్యమము

శ్రీసమ మీవ యుచితము శ్రీహరికి

41.   

 

నాఁ బల్కి దీవించి నారదుఁడు మృగ

శాబాక్షిఁ జనియె నాసతి పూజ లంది

42.  

చెలికత్తియల గూడి చిద్విలాసముగఁ

గలహంస గమన వికసిత సుమ ముఖి

43.  

 

ముదమార విహరింప మురిపెంపు వనము

సదమల చిత్తయై చేరె నభ్భామ

44.  

మంజుల పిక శుకామర రావములును

రంజన సుఫల భార నత ద్రుమములు

45.  

 

శరభ వారణ మృగ చమర కురంగ

హరి భల్ల సంచరి తాంచిత వనము

46.  

విమల జలాశయ విస్ఫారితమ్ము

కమనీయ బక హంస గణ సంయుతమ్ము

47.  

 

కమల కోకనద ప్రకర భాసితమ్ము

భ్రమర యుగళ గణ పరిసర్పితమ్ము

48.  

సుందర వనమున సుమ సేకరణము

డెంద మలరఁగ రండి సుదతు లార

49.  

 

ముదమార నిట రాజపుత్రిక తోడ

కదలి చేయుద మనఁగఁ దిరిగి రపుడు

50.  

అంత వనాంతర మందు వీక్షించి

రింతు లుద్విగ్నులు నిద్ధ దంతి నట

51.   

 

గండ ద్వయోద్భవ ఘన మద ధార

చండ దంత యుగలోజ్వల విలసితము

52.  

కరిణీ గణ సమేత గజరాజుఁ జూచి

తరుణు లేఁగిరి వేగఁ దరుల చాటునకు

53.  

 

ధవళాశ్వ వాహన ధన్వి యొకండు

రవినిభ తేజుండు ప్రాయంపు వాఁడు

54.  

విద్యుల్లతా సమవేత మేఘ నిభుఁ

డుద్యదంబక హస్తుఁ డున్నత భుజుండు

55.  

 

రత్న కంకణ కుండల కటి సూత్ర్రాది

రత్నాభరణ సువిరాజమానుండు

56.  

నళిన దళ నిభ కర్ణాంతాయ తాక్షుఁ

డళినీల కేశుండు నసిత వర్ణుండు

57.  

 

పీతాంబర కటి సంవీతుండును గల

ధౌత యజ్ఞోపవీత విరాజితుండు

58.  

దక్షిణావర్తిత తరళ శ్రీవత్స

లక్షిత వక్ష స్సులక్ష ణాంగుండు

59.  

 

ఈహా మృగార్థము నేఁగి వెంటాడు

వాహాధిరోహుని వామాక్షు లచట

60.  

విస్మయమ్ము మదినిఁ బెల్లుబు కఁ గని

సస్మిత వదన విశాలాక్షు లైరి             

61.   

 

కరిరాజు గడుఁ బ్రీతిఁ గరివరదుఁ గని

కర మెత్తి తల వంచి కదలె వెనుకకు      

62.  

హయము పైనుండి మృగాన్వేష ణార్థి

యయి రమణులఁ జే‌రి యడిగె నీ రీతి

63.  

 

మృగ మొక్క టగపడి ధృతిఁ బాఱి పోయె

మగువలార కనిన మాకు జూపుఁ డనె

64.  

అనవుడు మేమెట్టి యడవి మృగమును

గన లేదు నీదు రాకకుఁ గత మేమి

65.  

 

వధియింప జనదిట వర్తించు మృగము

ల ధరణీంద్ర తనయ రక్షిత వనము

66.  

వేగమ చను వింధ్య విపినము వీడి

జాగు సేయ కనుచు సఖు లెల్ల పలుక

67.  

 

వారి పల్కులు విని వారువమ్ము దిగి

వారి జాక్షులు మీరెవరు లలితాంగి

68.  

కనకపద్మ నిభ వాల్గంటి తానెవరు

విని యేఁగువాఁడ స్వవేశ్మము చెపుఁడు

69.  

 

ఆమాట విని ధరణ్యాత్మ జానుమతి

ధీమతి పద్మావతి యను వయస్య

70.  

ఆకాశ రాజప్రియ తనయ శూర!

మాకు నాయకురాలు  క్ష్మాజ సచ్చరిత

71.   

 

నామంబు పద్మిని నారీలలామ

వామాక్షి సుందర వదన శుభాంగి

72.  

నీ నామ మెయ్యది నీ కుల మేది

సూనృతమ్ముగఁ జెప్పు సుందరాకార!      

73.  

 

ఎవ్వరి వాఁడ వీవెట నుందు వంచు

నవ్వనిత యడిగె నాశ్చర్య ముగను

74.  

తానంత మందస్మిత వదనాంబుజుఁడు

మానినుల కనియె మాపూర్వ జనులు

75.  

 

రవి వరాన్వయ సువిరాజితుల మని

భువన సమ్మోహ నంబుగఁ బల్కు చుండ్రు        

76.  

నామమ్ము లెంచ ననంతము లవని

నామస్మరణ పాప నాశ కారకము

77.  

 

బుధులు ప్రేమగ వర్ణమునఁ గృష్ణు డందు

రు ధర నామమ్మున రుచిరాంగు లార

78.  

ఎవ్వని చక్రము నీక్షించి నంత

నెవ్వని శంఖపు టిద్ధధ్వని విన

79.  

 

భూసు రాదిత్య రిపుల కనిశమ్ము

త్రాస సంతప్త హృదయ కంప మగునొ

80.  

ఎవ్వని విల్లున కిద్ధరఁ బాఱు

దవ్వులకు నమృతాంధసుల విల్లులును

81.   

 

అవ్వానిగ నెఱుఁగుఁ డబల లార నను

నివ్వేంక టాచల హిత వాసి నిపుడు

82.  

మృగమును వేటాడ మిత్రుల తోడ

నగము నుండిట వచ్చిన నతివఁ గంటి

83.  

 

తరలాక్షిఁ గన నాకు తగులమ్ము కలిగె

వర మీయ మన్నచో భామయే మనును      

84.  

అనవిని సఖు లెల్ల నాగ్రహమ్మునను

జను శీఘ్రమమ్మునఁ జపలత వీడి

85.  

 

శూరుఁడ మా రాజు చూచిన నిన్ను

ఘోర రోషమ్మునఁ గొలుసులఁ గట్టు         

86.  

తర్జితుం డయి యిట్లు తరుణుల చేతఁ

గర్జము వీడి వేగ నరిగె గిరికి

87.  

 

అలమేలు మంగ చిత్తాంచిత చోర

నలినదళాక్ష వనజభవ వినుత

88.  

 

 

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత

వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

పద్మావతీ శ్రీనివాసమునఁ దృతీయాశ్వాసము

 

 

 

పద్మావతీ శ్రీనివాసము

చతుర్థాశ్వాసము

 

శ్రీభూనీళాదేవీ | వైభవ నాథా మురహర పక్షీంద్ర విహా

రా భువనోద్ధార కమల | నాభా భువనైక మోహనా పరమాత్మా   1

                                                                

 

దివ్య సౌధమున కేతెంచి హరి దిగి

భవ్యంపు మణి మండపముఁ జేరె నంత

2.     

సఖులు నిషాద వేషము వీడి నాక

ముఖు లైరి దివిజులు మురహరి వేఁడ

3.     

 

సూటిగ మణిమయ సోపానములను

దాఁటి ముక్తాలయ తల్పము సేరె

4.     

నవరత్న ఖచిత సనాతన మంచ

వివశ శయనుఁ డయ్యె విరహ వేదనను

5.     

 

తనుమధ్య మందస్మిత వదనాంబుజ న

యన విశాల నళినజాభ పద్మభవ

6.     

సుందరి పద్మిని సోయగమ్మునకుఁ

గందర్ప శరఘాత కల్లోలుఁ డాయె

7.     

 

అంత మధ్యాహ్న కాలాసన్న మైన

సంతత భక్తి సత్సంగ నిజ సఖి

8.     

సతి వకుళాదేవి సన్నుతుని నధి

పతి శ్రీనివాసునిఁ బరమ పురుషుని

9.     

 

పద్మాక్షు సేవింప భక్ష్యములు గొని

పద్మావతియు పద్మపత్రయు మరియు

10.   

చిత్రరేఖయు సమంచిత సుదతులు ప

విత్ర మానసు లంత విచ్చేసి రటకు

11.    

 

వ్యంజన సహిత దివ్యాన్నము గంధ

మంజుల మమర సమ్మత భాసితమ్ము

12.   

పాయ సాన్నము నపూప వటక గౌడ

ఛాయంపు ముద్గాన్న సౌచాన్నములును

13.   

 

కాంచన పాత్రలం గైకొని సఖుల

నుంచి ద్వార తటిని నుత్సహించి చని

14.   

వకుళ మాలిక పరాత్పరుఁ గాంచి భక్తి

ముకిలిత హస్తయై పూజించె నతని      

15.   

 

లలితాంగి రత్న తల్పస్థిత వివశుఁ

జలితాత్ముఁ గని పాద సంవాహనమ్ము

16.   

చేసి యేల శయనించితి వింత తడవు

వాసుదేవ భుజియింప వలయుఁ జుమ్ము

17.   

 

నాఁ బల్కి నన్య మనస్కు విలోలు

వేపమానుం గని వేదన నడిగె

18.   

నీ విటు నిర్లిప్త నిరవధి కార్తి

నో వీరవర యేల నుంటి వార్తిహర

19.   

 

మృగయార్థి వచట నే దృశ్యంబు గంటి

వి గజయాన వలని వివశత తోఁచె

20.  

దేవ కన్యను గంటె ద్విజ కన్య నైన

భావాపహరి నర భామినిఁ గంటె      

21.   

 

చెప్పు మార్య యని యా చేడియ యడుగ

నప్పుండరీకాక్షు డంత నిట్టూర్చి

22.  

వకుళ మాలికఁ గని వామాక్షుఁ డనియె

సకలమ్ము నుడివెద సత్యమ్ము వినుము      

23.  

 

త్రేతాయుగ మది వధించితి నేను

సీతాపహారి దుశ్శీలు రావణుని

24.  

వేదవతీ కన్య వినయ సంపత్తి

యాదరించె సిరి సహాహియై కరము

25.  

 

సీతయై లక్ష్మియ క్షితి నుద్భవించె

భూతల పతికి నపుడు పువ్వుఁబోణి

26.  

పంచవటిని వీడ వధకు మారీచు

పంచగ సీత యవరజుఁ డేతెంచ

27.  

 

అంత సమీపించె నా రావణుండు

పంతమూని మది నపహరింప సీత

28.  

అగ్ని హోత్ర గతాగ్ని యంత కార్య సుని

మగ్నుఁడై రావణు మనసు నెఱింగి

29.  

 

స్వాహా సతి సరసఁ బాతాల మందు

స్నేహ భావము మీఱ సీతను దాఁచి

30.  

రావణ స్పృష్ట కారణ దగ్ధ తరుణి

నా వేదవతిని సీతాకృతి విడిచె

31.   

 

రావణాపహృతయై లంకానగరము

దైవోపహత సేరె దైన్య భావమున

32.  

దశకంఠుని మరణోత్తరమునఁ దిరిగి

కృశమధ్య దారుణాగ్ని శిఖల దూఁక

33.  

 

పావకుండు మహానుభావుండు రక్షి

తావని సుతను స్వాహాశ్రిత సుమతి

34.  

సీతఁ జూపుచు భద్ర శీలినిఁ గీల

జాతము నుండి భూజ సవేదవతిని

35.  

 

ఇచ్చి పలికె సీత యీమె యని మన

మచ్చెరు వందగ నా వేదవతిని

36.  

పుణ్యవతినిఁ జూపి పూఁబోఁడి బదు ల

గణ్య సంకటములఁ గందె నిభ్భామ       

37.  

 

లంక యందని పల్కి లావణ్య వతిని

నింకఁ గరుణ జూచి యేలుకొను మనె

38.  

నా విని జానకి ననుజూచి పలికె

దేవ వేదవతి ప్రీతి నొసఁగె నాకు

39.  

 

వారిజాక్షి పరమ భాగవతి సతి

కారుణ్యము వహించి కల్యాణ మాడు

40.  

అగణిత గుణశీలి నష్టాదశ కలి

యుగమున వరియింతు నువిదను బ్రీతి

41.   

 

అమర పూజల నంది యబ్జజ లోక

మమరి యుండును నారి యంత వఱకును

42.  

తదనంతరము భూమి తనయగఁ బుట్ట

ముదముగ నా వరము సిరి వరమున

43.  

 

ఆకాశ రాజున కాసతి యిపుడు

రాకుమారి ధరణి రంజిల్ల దొరికె

44.  

నారాయణ పురమున నళిన రాశి

నారాయణీ నిభ నళిన దళాక్షి                   

45.  

 

చెలికత్తియలఁ గూడి చిరునవ్వు తోడ

నలినాక్షి యంత వనమునఁ దిరుగుచు

46.  

మృగముల వేటాడ మెలఁగెడి నాకు

నగపడెఁ గోయుచు నలివేణి విరుల

47.  

 

వర్ష శతమ్ముల వర్ణింప దరమ

హర్ష మెసఁగఁ గలహంస గమనను

48.  

పద్మాభ పద్మజ పద్మ దళాక్షి

పద్మాభయప్రద పద్మాక్ష వరద

49.  

 

మేన నసువుల కల్మి పొసఁగు నపుడ

తాను రమా సహితము నన్నుఁ జేర      

50.  

వకుళ తెల్పుము వియత్పతి పుర మేఁగి    

సుకుమారిఁ గని నాకు సుందరి తగునె

51.   

 

అనవిని వకుళ మోహాపన్నుఁ గాంచి

చనియెదఁ జెప్పుడి సతియున్న దారి     

52.  

వేగమ యేఁగుదు విశ్వేశ చూడ

నా గజయానఁ గల్హార నయనను

53.  

 

అంతఁ జెప్పఁ దొడంగె నరవింద నేత్రుఁ

డింతికిఁ బ్రియమార నింపైన దారి

54.  

అతివ యీ శ్రీనృసింహ కుహర మార్గ

ము తరించి భూధరము మనోజ్ఞము దిగి

55.  

 

సంయ మీంద్రుం డగస్త్య సదాశ్రమమ్ము

సంయానఁ గని కుంభ సంభ వార్చితము

56.  

లింగ మగస్త్యేశు లీలా మయుం ద

రంగ భాసిత సువర్ణ ముఖరీ తటిని

57.  

 

పూజించి కడుభక్తి  పూఁబోఁడి సనుము

భాజనీయము శుక వనము సుందరము

58.  

అన్నదీ తట పధ మనుసరించి చనఁ

గన్నుల కింపగు కమలాకరమ్ము

59.  

 

రుచిరమ్ము పద్మసరోవర మందు

శుచిగఁ దానము సేసి శుక మహాత్ముండు

60.  

తప మాచరించు నతని నుతించి యమ

ర పతినుతేంద్ర నీలమణి వర్ణుండు

61.   

 

పీతామలాంబర వినుత కృష్ణ సహి

తాతత బాహు తాలాంకుఁడు నుండ   

62.  

రామకృష్ణులు శుకారాధ్యులట బల

రాముఁడు తీర్థయాత్రకు నేఁగు వాఁడు

63.  

 

వార లిరువురను భక్తి నుతించి        

వారిజములఁ గొని పద్మాకరమున

64.  

ముదిత యంత సువర్ణముఖి నుత్త రించి

పదిలమ్ముగ వనోప వనములు దాఁటి

65.  

 

అరణీ నదీ తీర మనువుగఁ జేరి

విరిబోఁడి వనమున విశ్రాంతి గొనుము       

66.  

అట జన నారాయణాఖ్య పురమ్ము

నటవీ పరివృతము నరయంగ నోపు

67.  

 

వనమున కన్పట్టు ఫలపుష్ప సహిత

పనసామ్ర తిందుక పాటల కుంద

68.  

చంపక వరుణ రసాల శిరీష

మింపైన పున్నాగ హింగు ప్రియంగు

69.  

 

సాల తాళాంకోల శాల్మలీ ప్లక్ష

మాలతీ యూధికా మల్లికా కుంద

70.  

ఖర్జూర నింబ నాగ వకుళాశోక

భూర్జ హింతాల జంబూ బీజపూర

71.   

 

కీచకోదుంబర కింశుక లికుచ

మాచీ ముఖప్రియ మందార నీప

72.  

చించార్జున బదరీ శ్రీ పూగ మధుక

మంచిత నారికేళాశ్వత్థ యుతము

73.  

 

కరవీర  కంజాత కల్హారములును

గరుడ సారస శుక ఖగ సంకులమును

74.  

భ్రమర ఝంకార సుస్వర మనోహరము

కమనీయ ఘన తటాక విరాజితమ్ము

75.  

 

మగువ పుష్పోత్తర మార్గమునఁ జని

నగరమ్ము రమ్యము నారాయణపురి     

76.  

గంగానదీ సమ కల్లోలవతియు

భంగ తట్యరణి శైవలిని నచ్చోట

77.  

 

కని యధోచితమగు కార్యము సేయు

మని నుడివి శయన మాశ్రయించె హరి

78.  

అంజలి ఘటియించి హరికి నయ్యింతి

గుంజామణి సమము గుఱ్ఱము నెక్కి

79.  

 

శ్రీనివాసోక్తంపుఁ జెలువంపు దారి

మానిని చనియె కమలనేత్ర దృతిని

80.  

మృగములఁ జూచుచు మృగశాబనయన

మృగరాజులను ఖడ్గమృగముల కపుల

81.   

 

గోమాయు భల్లూక కుంజరములను

భీమశరభములఁ బెద్ద పులులను

82.  

సారస పిక శుక చక్రవాకముల

గారవ మొప్పంగఁ గాంచుచు నంత       

83.  

 

స్వర్ణముఖరిఁ గుంభసంభవుఁ గొల్చి

పర్ణశాల సదాశివ భజనఁ జేసి      

84.  

శుక వనమున వ్యాససూనుఁ బూజించి

బకరిపు బలరామ పదములు మ్రొక్కి      

85.  

 

పద్మసరోవర వనములఁ దోఁగి

పద్మములఁ గొని యబల సేదఁ దీరె     

86.  

దినమంత పయనించి దినకరుఁ డలసి

వనజములు గుములఁ బశ్చిమాద్రి సనె

87.  

 

కలువలు వికసించెఁ గాంతు శశిఁ గని

సలిపె నృత్యమ్ములు చక్రవాకములు       

88.  

శార్వర మూనె దిశల సద్దు మణిఁగె

సర్వులు సుఖనిద్ర సల్పిరి జగతి

89.  

 

చక్కఁగఁ దెలవారె శార్వరి గడువ

కొక్కురో యంచు కుక్కుటములు గూయ

90.  

అరుణ కాంతులు వనమంత విరిసెను

దరుణి వకుళ యంతఁ ద్వరపడి సాగె

91.   

 

దివ్య సతి వకుళా దేవి వేగముగ

భవ్యారణీ నది పశ్చిమ తటిని

92.  

చేరి కాంచె నపుడు శృంగార వతుల

భూరి రాజ ద్వారము వెడలి వేగ

93.  

 

దైవ సన్నిధికి నేతెంచిన వారి

వైవిధ్య సద్దామ వస్త్రాభరణల

94.  

ఎవరు మీరలు కార్యమెయ్యది సదమ

ల వదనులార నెలవది యేది యని

95.  

 

వారలఁ బ్రీతి నవ్వనిత యడిగిన

గారవ మొప్ప నా కన్యక లనిరి

96.  

ఆకాశ రాజగృహ నివాసులము స

దాకార యౌ పద్మజాంచిత నామ

97.  

 

రాజ నందన సఖీ రమణుల మమ్మ

రాజోపవనమున రాజీవ నయన              

98.  

కుసుమాపచయము సంకోచము లేక

మసలి సలుపుచు విమలమతి నుండె

99.  

 

అపచయ మింపుగ నాచరించు సఖి

నిఁ బదిలముగఁ జూచు నేర్పున నుండ      

100.                             

వృక్ష మూలమ్మున వెసఁ గన్పడె ఘన

వక్షుండు నాజాను బాహు దర్పుండు

101.                              

 

నీలి మేఘశ్యామ నిరుపమానుండు

మాలా ధరుండును మాననీయుండు

102.                             

మకర కుండల మణి మయ విభూషితుని

నకళంక రూపుని నరవింద నయను

103.                             

 

కాంచి పద్మావతి కమల దళాక్షి

కాంచన నిభ దేహి కనుఁడు గనుఁ డని

104.                             

మాకుఁ జూపఁ  ద్రుటిని మా యెదుటనె స

దాకారుఁ డయ్యెఁ దా నంతర్హితుండు         

105.                             

 

అంత మా సఖి మూర్ఛ నందంగ వెఱచి

యింతిని ననిపితి మింపుగ గృహము

106.                             

 

సంకట కల్మష సంచయ హరణ        

వేంకట గిరివాస వేంకట రమణ

107.                             

 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత

వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

పద్మావతీ శ్రీనివాసమునఁ జతుర్థాశ్వాసము

 

 

పద్మావతీ శ్రీనివాసము

                                                      పంచమాశ్వాసము                                       

 

                             శ్రీరామా కారుణ్యా | కారా కల్యాణ కారకా కృష్ణా దే

                             వారాధ్యా దైత్యారీ | క్షీరాంభోధ్యాత్మజేశ శ్రీవత్సాంకా       1

                                                                

 

ధరణీశుఁ డస్వస్థ తనయను గాంచి

కరము చింతించి యాకాశ రాజు మది

2.     

దైవజ్ఞుఁ బిలిపించి తనయ జాతకము

నా విప్రునకుఁ జూపి యడిగెఁ దత్ఫలము        

3.     

 

సద్బ్రాహ్మణుఁడు బృహస్పతి సదృశుండు

సద్బ్రహ్మ విజ్ఞాన సంపన్న ఘనుఁడు

4.     

గ్రహము లన్నియు శుభకర గతి నుండె

మహిమాన్వితముగ సంశయము శూన్యమ్ము

5.     

 

నీదు తనయ యందు నిరుపమానముగ

కాదేని నిత్యపు గ్రహ ఫల మెంచ

6.     

కొంచెము విభ్రాంత గోచరము గన

నెంచఁ బ్రశ్న సమయ మించుక నిపుడు

7.     

 

చాయను లగ్నము సరిజూడ లగ్న

నాయకుఁడు శశి లగ్నమ్మున నుండె

8.     

గురువు కేంద్రమ్మునఁ గూర్చుండె దినపు

పురుగు నిద్రను రాజ్యమునఁ బ్రశ్న పక్షి

9.     

 

ఫలితము గణియింపఁ బార్థివ వినుము

చెలువంపు స్వస్థత చేకురు నయ్య

10.   

పురుషోత్తము నొకని ముగ్ధ మోహనుని

నరవింద నిభముఖి యవ్వనా గతుని

11.    

 

కాంచి మోహావేశ కలితాత్మ యాయె

కాంచన వర్ణాభ కన్యకుఁ గల్గు             

12.   

పురుషోత్తముని యోగము పుడమి నిజము

వరకన్య నొకతినిఁ బంపు నాతండు

13.   

 

శుభమగు మీకు నా సుదతి నుడువుల

కభిమతముగ సాగ గారవ మొప్ప

14.   

తనరి యగస్థ్యార్చిత శివ లింగమును

ఘనముగ నభిషేక కలితుఁ జేయంగ

15.   

 

తనయకు కల్యాణదాయకం బగును

బనుపు విప్రవరులఁ బార్థివేంద్ర యని

16.   

దైవజ్ఞుఁడు వలుక ధరణి నాథుండు

శైవ కార్యము సల్ప సద్బ్రాహ్మణులను

17.   

 

నియమించి మము పిల్చి నెలఁతుక లార

రయమున నేఁగి మీరలు వస్తు తతిని

18.   

సమకూర్చి రండన సత్వర మాల

యమున కేఁగిన వార మతివ మే మెల్ల

19.   

 

మానినీ నీ యాగమన కారణమ్ము

నీ నామ మెయ్యది నెలవది యేది

20.  

హయమున వేగ దివ్య రమణి వోలె

నయనమ్ములకు నింపన దయ జేసితివి

21.   

 

నావిని పల్కె నానందము గల్గ

నే వేంకటాచల నిలయమ్ము దాన

22.  

వకుళ నామంబునఁ బరఁగుదాన బెద

రక సుంత యాకాశ రాజు దేవేరి

23.  

 

ధరణీ సతిఁ గనఁ గదలి వచ్చితి వెస

నరయ గలనె నేను నా దేవి నిపుడు

24.  

వనిత మాటలు విని వారిజాక్షులు స

వినయముగ ననిరి వీ లగు నంచు

25.  

 

పల్కి యివ్విధి వా రవనిపతి గృహము

కల్కి వకుళ గూడి కదలి చేరంగ

26.  

పుర వీథి గుంజా విభూషిత శబరి

చరియింప వీపునఁ జంటిపాప నిడి

27.  

 

సోది చెప్పెద నంచు సుదతి భాషింప

నాదరమ్మునఁ బిల్చె నా రాజ పత్ని

28.  

రాజ సౌధమునకు రమణి చెంచితను

భాజనీ యాపర్ణ వర శూర్ప మందు

29.  

 

ముత్తూము ముత్తియములఁ బోసి సోది

కత్తియఁ జూచి నిక్కము సెప్పు మనియె      

30.  

చేటలోఁ బోసిన చెన్ను ముత్యముల

సూటిగ మూడు రాసులు సేసి  రాణి

31.   

 

జరుగఁ బోయెడి వాని జక్కఁగఁ జెప్పు

తరుణీ యనంగ మధ్యపు రాసినిఁ గద

32.  

నీవు దలఁచితివి నీరజాక్షి యన

భావము సెప్పుము పడతి నిజ మది

33.  

 

ధన రాసు లిత్తు సుదతి నీకు నిజము

ను నుడివిన నన మానుగఁ బల్కె శబరి

34.  

తల్లి మఱి శిరో రత్న మది నీయఁ గదె

కల్ల కాదు సుమి వక్కానింతు నిజము

35.  

 

నావిని పాయ సాన్న మడరు నట్టి

సౌవర్ణ పాత్రను శబరి కిడె సతి    

36.  

క్షీరాన్నము తినిపించి సుతున కంత

ధారాళముగను సత్యము చెప్పఁ దొడఁగె

37.  

 

భవదీయ నందన పద్మావతీ స

తి వల పెఱుఁగక మదిఁ గడు జింతితవు

38.  

తన యాకులతకు సంతాపమ్ము వలదు

వనమందుఁ గాంచెను వర పురుషు ఘను

39.  

 

వేంకటాద్రి నివాసు విష్ణు సన్నిభుని

సంకట హరణుండు శార్ఙ్గ ధరుండు

40.  

మురిపించు నా స్వామి పుష్కరణీ త

టి రమా వినోద మండితుఁ డసు రారి

41.   

 

పురుషోత్తము మురారిఁ బుండరీకాక్షు

వరతన్వి పరవశత్వము జెందెఁ గాంచి

42.  

వనజాక్షిఁ జూచి యప్పరమాత్ముఁడును

ఘన మోహ సందీప్త కాంతుఁడు నయ్యె

43.  

 

మదగజయాన వామకరాభిలాషి

సుదతి స్వసఖిఁ బంపు సుందర నేత్ర

44.  

నీదు సన్నిధికిని నీరజాక్షుండు

శ్రీదేవి సన్నిభ సేపట్టు దనయ

45.  

 

అఖిలాండ విభుఁ జేరి యానందముగను

సుఖియించు నిత్యము సుందర వదన      

46.  

చింత వలదు తల్లి చిన్ని నా సుతున

కింత శుద్ధాన్నంబు నీయవే యన్న

47.  

 

ధరణి యన్నమొసంగి తగుఁ గానుక లిడి

యరగె నంతఃపుర మానందముగను

48.  

అంత నందన చెంత కారాణి యేఁగి                

కాంతావృతను బ్రీతిగ నడిగె నిట్లు

49.  

 

తల్లీ పలుకు మెడందఁ గలట్టి కాంక్ష

తల్లడ పడనేల తల్లినిఁ గంటె        

50.  

మాతను వీక్షించి మందస్వరమున

జాత రాగ దళిత చారునేత్ర యనె

51.   

 

ఆజాను బాహుండు నఖిలాండ విభుఁడు

తేజో మయుండు ధాత్రీ రక్షకుండు

52.  

భువన మోహనుఁడు సత్పురుష ప్రియుండు

నవలోకనప్రియు లబ్జ జాదులును

53.  

 

భక్త సులభుఁడు సర్వవ్యాపకుం డ

భక్తాలభుండు దేవతల దేవుండు

54.  

ఆర్త జన వర భక్తాభీష్ట దాత

వర్తిల్లెఁ జిత్త మప్పరమాత్మ యందు

55.  

 

శోధింపుఁ డాతని సుర రాజ వంద్యు

నాధీన మయ్యె నా హరియందు మనసు

56.  

తనయ మాటలు విని తరలాక్షి భక్త

జన లక్షణములు విశద పఱపు మన

57.  

 

అతి గుప్తములు దల్లి యవి సావధాన

మతి విన్ము నుడివెద మాన్యుల ఘనత

58.  

చెప్పఁ దొడఁగె సుత చెన్నుగ నంత

నప్పరమాత్ము భక్తాగ్ర గుణములు

59.  

 

శంఖ చక్రములు భుజద్వయమునను

రింఖద్రజత నిభ రేఖాంక మనఁగ

60.  

పుండ్రము ధరియింత్రు మురియుచు నుదుట

దండ్రి హరి మది నిత్యమ్ము వేడంగ

61.   

 

ధరియింత్రు పండ్రెండు ధవళ పుండ్రములు

పరి తుష్టు లితరులు భాగవతులును

62.  

కేశవ నామ సంకేతము లవియ

నాశన మొనరించు నానాఘములను

63.  

 

ఫాలము నుదరము వక్షము కంఠ

నాళము జఠరము నడుమ పార్శ్వముల

64.  

భుజ యుగమును గళపు వెనుక తటిని

భుజముల పైన నింపుగ ద్వాదశములు

65.  

 

నామము లెల్లఁ దనర నడి నెత్తి

పై మఱి వాసుదేవ యన నుతింత్రు

66.  

నిత్యాగ్నిహోత్రులు నిజ భాగవతులు

సత్య సంధులె యనిశము భాగవతులు

67.  

 

నిజదార రతు లవనిని భాగవతులు

సుజనాళి సుముఖులు సుమ భాగవతులు

68.  

పరదారలం దలఁపరు భాగవతులు

నిరతాధ్యయను లవనిని భాగవతులు

69.  

 

పర నిందలను సలుపరు భాగవతులు

పర ధన మపహరింపరు భాగవతులు

70.  

భూత గణ హితు లెపుడు భాగవతులు

వీత రోషులును భువిని భాగవతులు

71.   

 

మూల మంత్రమ్మును బురుష సూక్తంపు

జాలము పిమ్మట జాతవేద మను   

72.  

ఘన మంత్రము పఠించి క్రమముగ భక్త

జనులెల్ల ధరియింత్రు శంఖ చక్రములు

73.  

 

బాగవతుల యంద పరమాత్ము డుండు

నా గరుడ గమను నంద లగ్నంబు

74.  

నాదు చిత్తము దల్లి నారాయణ వర

పాదము లింపుగ బడయఁ జింతింపు

75.  

 

శ్యామల వర్ణుని స్మరియింతు నతని

నామమ్ము దలఁతు నన్య నరుల నొల్ల

76.  

 

వే పల్కి యాగెను విరిఁబోఁడి దుఃఖ

వేపమాన హృదయ విహ్వల గాత్ర

77.  

నావిని హరి దర్శన విధి యెయ్యదని

భావింపఁ జాగెను వసుధాసతి మది

78.  

 

అంత సద్విజులు శివార్చనఁ జేసి         

చెంతఁ జేరంగఁ బూజించి సద్విధుల

79.  

దీటైన ధనమిచ్చి దీవన లంది        

బోటుల చెంతఁ బూబోఁడినిఁ గాంచి

80.  

 

రాజ కన్నియల నరసి రాజ పత్ని

పూజార్హ  మైన యిప్పొలఁతి యెవ్వ రన

81.   

వన మందు మముఁ జేరి పల్కెను వకుళ

తన నామ మని వనిత మిము నడుగగ

82.  

 

వేంకట గిరివాసి వేగ మిచ్చటికిఁ

బంకజాక్షీ గొని వచ్చితి మమ్మ

83.  

ఇద్దేవి నిచటకు నీప్సిత మేమి

యిద్ద చరిత్రకు నీవ యడుగుము

84.  

 

వారి మాటలు విని వసుధాసతి గని

వారిజాక్షినిఁ దగఁ బల్కె నీ రీతి

85.  

ఎవ్వరి దానవు హిత మేది నీది

యవ్వ వచింపు సత్యము దీర్చెద నన

86.  

 

వకుళ నా నామంబు వసుధేంద్ర పత్ని

సకలము నుడివెద సత్యము వినుము

87.  

వేంకటాద్రి నివాసి విభుఁడు మా కతఁడు

పంకజాక్షుఁడు శ్రీనివాసుండు ఘనుఁడు

88.  

 

వేటకై యొకనాఁడు విపినమ్ము వెడలె

పాటవమ్మున శ్వేత వాహమ్ము నెక్కి

89.  

మృగ గజ సింహాది మేటి జంతువుల

సొగసైన కలకంఠ శుక సంచయముల

90.  

 

కాంచుచు మాస్వామి గజరాజు ననుస

రించుచు నుండె కరేణు సహితను

91.   

వన వనము లరిగి వనజాక్షుఁ డంత

కనె శంఖణ నృపతి ఘన తాపసు నట    

92.  

 

శ్రీభూసహితముగ స్థిరముగ నిల్పి

భూభృత్తు నందు నింపుగ జనార్దనుని

93.  

చారు సరస్సది శంఖనాగ బిల

మారామ శోభిత మాతటి యందు

94.  

 

అర్చన లొనరించు నా భూపతిఁ గని

చర్చిత గాత్రుఁడు సైంధవము దిగి         

95.  

రాజ వేషమున నా రాజు నడిగె వి

రాజమాన నృప వరా భూధరమున

96.  

 

నీ చేయు పని యది నే నెఱుఁగంగ

వాచాతిశయములఁ బల్కఁగ రాదె

97.  

నావిని యనె శంఖణ నృపుండు నంత

నా విభు శ్వేత మహారాజు సుతుఁడ

98.  

 

హైహయ దేశమ్ముహరిభక్త వరుఁడ

నాహవనమ్ముల నాచరించితిని

99.  

మిక్కుటముగ భక్తి మీఱంగ నేను        

మక్కువ తోడఁ గమల నాథునిఁ గన

100.                             

 

విష్ణు దర్శన కాంక్ష విస్తృత మయ్యెఁ

దృష్ణ తీరఁగ నోచఁ గృపఁ జూడఁ డాయె

101.                              

అంతఁ బల్కెను బ్రీతి నాకాశవాణి

వింతైన సుద్దుల వేదన తీర

102.                             

 

దర్శన మీ రాదు ధరణీశ పుత్ర

కర్శితుఁడవు గాకు కలఁతఁ వీడు మిఁక

103.                             

అటఁ జని నారాయణాద్రి సద్భక్తిఁ 

బటుతర తపము సల్పఁగఁ గోర్కి తీరు                  

104.                             

 

దివ్యవాణి వలుక దేశమ్ము వదలి

భవ్యముగ నిచట బరమాత్ము నిలిపి

105.                             

దేవు నగోచరు తేజు నర్చింతుఁ

బావ నాగస్త్యు దీవనల నిత్యమ్ము       

106.                             

 

అనవుడు మాస్వామి హాస్య ముప్పొంగ

ననెఁ జను నారాయణాద్రి నృప వర

107.                             

పయనించి గిరి నెక్కి పశ్చిమ దిశకుఁ   

బ్రియమైన న్యగ్రోధ వృక్ష మూలమున

108.                             

 

బాలునిఁ జూచి విష్వక్సేను నచట

కేలు మోడ్చి యతనిఁ గీర్తించి యంత        

109.                             

స్వామి పుష్కరి ణట స్నానమ్ము సేసి

భూమీశ పుత్ర నింపుగ నపర దిశ     

110.                              

 

చని కను మశ్వత్థ సాల రాజం బ

వని పతి నందన వల్మీక మచట

111.  

రమణీయ ధవళ వరాహ మచ్చోట

కమనీయ మగు ననఘ మతుల కెల్ల

112.                              

 

తప మాచరింపు సద్భక్తి నచ్చోట

కృపఁ జూచు నిన్నట నృపరాజ పుత్ర      

113.                              

ఆదేశ మిచ్చుచు హయ రాజ మెక్కి

మోదమ్ము తోడ నమ్ముగ్ధ మోహనుఁడు

114.                              

 

వన వనాంతరములు వన మృగయార్తి    

వనజాక్షుఁ డరిగి స్రవంత్యరణిఁ గని         

115.                              

ముదముగ వారువమును దిగి నవ కు

ముద కువలయ వృతమ్ము వనజాకరము

116.                              

 

శీతల వాయు నిషేవితుం డగుచు

వీత దంతావళ వీక్ష ణార్తుండు

117.                              

విహరించు చుండఁగ విరుల దునుము ద

రహసిత వదనులు లలనలఁ గాంచె        

118.                              

 

తనర వారి నడుమ తరలాక్షి మేఘ

జనితస్వన విలసచ్ఛంపాలత నిభ

119.                              

శ్రీసతీ సమ సురుచిర రూప కనక

భాసిత దేహ సువర్ణ నీక్షించి

120.                             

 

మోహించి వారిని ముదమార నడిగె

నా హరి యెవ్వరీ యలివేణి యంచు

121.                              

ఆ కన్యలు వలికి రంత నిభ్భామ

యాకాశ రాజు మహాబలు పుత్రి

122.                             

 

ఆ మాటలను విని యశ్వంబు నెక్కి

దామోదరుం డంతఁ దన కొండఁ జేరె    

123.                             

పదపడి చనుదెంచి స్వామిపుష్కరణి

మృదువుగ నను బిల్చి మేదినీశుండు

124.                             

 

అతివ నీ వేఁగి వియద్రాజ పురము

సతి ధరణిఁ గని కుశలము నడిగియు     

125.                             

రాజ ప్రియ తనయ రాజీవ నయన

భాజనీయ వదన వధువుగ నడుగు

126.                             

 

రాజాభిమతమును రమణి నీ వడిగి

సౌజన్య మొప్పంగఁ జనుదెంచు మనియె

127.                             

మావిభు నాజ్ఞను మన్నించి నేను

దేవి నీ చెంతను దెలియ జేసి తిది

128.                             

 

రాజును మంత్రుల రాకుమారి విని

రాజపత్ని తగు కార్యమ్ము దెలుపుమ

129.                             

వకుళ మాటలు విని వసుధేంద్ర పత్ని

వికసిత వదనయై ప్ర్రీతి నొందె మది

130.                             

 

భక్తజన సురభి పాపవినాశ

ముక్తిప్రదాయక పుండరీకాక్ష

131.                              

 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత

వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

పద్మావతీ శ్రీనివాసమునఁ బంచమాశ్వాసము.

 


                        పద్మావతీ శ్రీనివాసము

షష్ఠాశ్వాసము

 

                             శ్రీమత్స్య కూర్మ సువరా | హామల రూపా ఘన నరహరి వేష ధరా

                             వామన భార్గవ రామా | రామ సుగురు కృష్ణ బుద్ధ లాలిత కల్కీ   1

                                                                

 

వెదకెడు లత కాలు వెనఁగిన రీతి

సుద తీప్సిత మ్మిసుకరంబు నయ్యె

2.     

కమలాలయను జేరి కాంతునిఁ బిలిచి

సుమతులు మంత్రులు సూచుచు నుండ

3.     

 

తరలాక్షి ధరణి సంతసమున వకుళ

మురిపెంపుఁ బల్కుల ముచ్చటింపంగ

4.     

ధరణి పల్కులు  మహిత ముదము నీయ

ధరణి విభుం డమాత్య పురోహితులను

5.     

 

సాదరముగఁ జూచి యనియె నీ  రీతి

మాదగు సుతను బద్మావతీ దేవి   

6.     

కమలాలయ సదృశ కమలను గోరె

నమర సన్నుతుఁ డసహాయ శూరుండు

7.     

 

వేంకట గిరి వాస వేద వేద్యుండు

సంకట హరణుండు చక్రాయుధుండు

8.     

శ్రీనివాసుం డని చెప్పి క్షితిపతి

మానుగ నడిగె సమ్మతి వారి నెల్ల

9.     

 

ధన్యుల మైతిమి ధరణీశ మనము

కన్యను నిచ్చినఁ గల్యాణ మగును        

10.   

శుభకర మైనట్టి సుముహూర్తము జగ

దభిరామమౌ వివాహమ్మున కెంచ

11.    

 

రావింపు రాజ సుర గురువు నిపుడు

దేవి పద్మావతి  దేవేశున కిడ

12.   

సుఖియించును గమలాక్షుని కర మంది

యఖిలాండ నాథుని యా రమ తోడ

13.   

 

వారి మాటలు విని పార్థివుఁ డంతఁ

గూరిమిని దివిజ గురువును బిలిచి

14.   

మృగశిర మాకన్య మేలైన తార

తగ శ్రవణము వరు తార గురువర

15.   

 

యోగ్యంపు లగ్నము నొడగూర్పు దేవ

భాగ్య కరంబయి పరఁగంగ నిపుడు

16.   

ఉత్తర ఫల్గుణ ముత్తమ మయ్య

యిత్తఱి పెండ్లికి నింపుగఁ జూడ

17.   

 

వైశాఖ మాసము పరిణయమునకుఁ

గౌశలమునఁ బల్కె క్ష్మాపతి కిట్లు          

18.   

గురువు బృహస్పతి కూరిమి పల్కు

లరసి పూజించి సురాచార్యుఁ బంపి

19.   

 

వకుళ మాలికఁ జూచి వసుధాధి నేత

ప్రకటించి లగ్నము వైశాఖ మందు         

20.  

విభు చెంత కేఁగియుఁ బెండ్లికై తరలి

విభవమ్ము తోడ రా వివరింపు మనియె

21.   

 

నాఁ బల్క మరి రాజనందన కీర

మా బాగరికి దూత యన నిచ్చి పంపె

22.  

తదుపరి క్ష్మాపతి తనయునిఁ బంపె 

త్రిదశాధినాథుఁ దోడ్తేరఁగఁ బ్రీతి      

23.  

 

విశ్వకర్మను బిల్చి పృథ్వీ విభుండు

విశ్వాసమునఁ బుర వీథుల నెల్ల

24.  

శోభాయ మానము సుందర తరము

వైభవోపేతము వఱుపంగఁ బనిపె   

25.  

 

వసుమతీశునిఁ దనుపఁగ విశ్వకర్మ

వెస నలంకరణము వీటినిఁ జేసె          

26.  

పురుహూతుఁ డొసఁగెను బుష్ప చయమ్ము

సుర కన్య లాడిరి సుందరముగను

27.  

 

ధనదుండు వంపెను ధన ధాన్యములను

యిన సుతుం డింపుగ నిచ్చె నరుజము

28.  

వరుణుండు వంపెను బద్మరాగముల

సుర లెల్ల జని రంత సుమహాద్రి వృషము

29.  

 

రాజానుమతిఁ బొంది రయమున కీర

రాజముతో వకుళ హయ మెక్కి సనె        

30.  

ఆ వృషభాద్రి నాహ్లాద ముప్పొంగ

దేవాలయమ్మున దేవదేవుఁ గని

31.   

 

సానుకూలము లాయె నఖిల కార్యములు

వీనుల విందుగ వినిపించు శుకము

32.  

పరిణయ విషయ మీ పతగ రాజమ్ముఁ

గరుణను విను మనెఁ గలికి యా హరిని

33.  

 

అనవుడు శ్రీహరి కనియె నా చిలుక

వినయమ్ము లొలుకంగ వినతులు సేసి

34.  

అతివ పద్మావతి యాడిన నుడులు

సతతమ్ము నీ నామ సంకీర్తనమ్మె

35.  

 

తలఁతును నిత్యము తమరూప మేను

నలినాక్ష కరుణించి నను స్వీకరించు

36.  

వెలయు నా దేహమ్ము విహిత పుండ్రముల

నలినాక్ష కరుణించి నను స్వీకరించు

37.  

 

కొలుతు నీ భక్తులఁ గుశలమ్ము నరసి

నలినాక్ష కరుణించి నను స్వీకరించు

38.  

సలలిత పంచ సంస్కారులఁ గొలుతు

నలినాక్ష కరుణించి నను స్వీకరించు

39.  

 

మెలఁగెద నెప్డు నీమెచ్చు కార్యముల

నలినాక్ష కరుణించి నను స్వీకరించు

40.  

అల నొసఁగె జనకుం డనుమతి నాకు

నలినాక్ష కరుణించి నను స్వీకరించు

41.   

 

నాఁ బల్క కీరమ్ము నగరాజ విభుఁడు

పూబోడి విన్నపము వివరమ్ముగను

42.  

ముదితాంత రంగుఁడై మురిపెమ్ము లొలుక

సదమల చిత్తకు సమ్మతిఁ దెలిపె          

43.  

 

అమరుల గూడి నే నరుదెంతునయ్య

కమలాక్షిఁ బెండ్లాడఁ గమనీయముగను   

44.  

శుకరాజ వచియింపు చోద్యమ్ము మీఱ

నకళంక మీసఖి యానంద మొంద

45.  

 

దామంబు నిమ్ము పద్మావతికి నభి

రామమై యొప్పదె రాజ నందనకు

46.  

దామంబు నాదేవ దత్తంబు తోడ

భామను జేరంగ బయనించెఁ జిలుక     

47.  

 

చేరి సఖినిఁ దులసీ మాల నిచ్చి

కీరమ్ము తెల్పెఁ జక్రి నుడువు లెల్ల 

48.  

మృగనాభి గంధపు మేలైన మాల

సిగ పైన ధరియించెఁ జిన్నారి పద్మ     

49.  

 

సంతోష ముప్పొంగ సముచిత రీతి

కాంతులు వెదచల్లు కనకాంకములను

50.  

ధరియించి శ్రీకాంతు దర్శనమునకు

విరియంగ నగుమోము వీక్షించు చుండె

51.   

 

క్షితిపతి సద్భక్తి శీతాంశుఁ జూచి

నుతియించి కోరె ననువగు భక్ష్యముల

52.  

రస సంయుతమ్మలు రమ్య భోజ్యములు

ను సుగంధ యుతములును జతుర్విధములు     

53.  

 

నైవేద్య యోగ్యము నారాయణునకు

దేవ నర ముని సంతృప్తి కరములు

54.  

సమకూర్చె సకలమ్ము సంభారములను

కమనీయముగ నంతఁ గలువల ఱేఁడు

55.  

 

పను లవి పెండ్లివి  వడినిఁ గావించి

కనులు మెరయు నలంకరణఁ జేయించి

56.  

మంత్రి సంయుత సభా మంటప మందు

మంత్ర రాగంపు సంరంభ ముప్పొంగ

57.  

 

వాద్య ఘోషమ్ములు వ్యాపింప దిశల

హృద్యంపు నృత్యమ్ము లేపార సభల

58.  

రాజ కుమారి నలంకృతఁ జేసి

రాజపత్నియు రాజు రాజస మొప్ప

59.  

 

మాననీయులు మోద మానసంబునను

శ్రీనివాసునకై నిరీక్షించి రంత

60.  

 

కరుణాంతరంగ సకల లోకనాథ

సురగణ సన్నుత సుందరాకార

61.   

 

 

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత

వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

పద్మావతీ శ్రీనివాసమున షష్ఠాశ్వాసము.

 

 

పద్మావతీ శ్రీనివాసము

సప్తమాశ్వాసము

 

 

                             శ్రీ సప్తగిరి నివాస వి | లాస విభవ భక్త జన వరప్రద వినుతా

                             భాసిత పుండ్రాభయకర | వాసవముఖ సురవరగణ వందిత దేవా      1

                                                                

 

కీరమ్ము సనుదేఱఁ గేశవుఁ డంత

శ్రీరమను బిలిచి స్నేహమ్ము తోడ

2.     

ఏమేమి వలయునొ యెఱిఁగింపు చెలియ

ప్రేమగ నీవింక పెండ్లికై యిపుడు

3.     

 

పనుపుము సకియలఁ బన్నుగ నీవు

నొనగూర్పఁ బను లెల్ల నుత్సాహముగను

4.     

అనవుడు శ్రీదేవి యానంద మొప్ప

ననిపెను బనులకు ననుఁగుంజెలులను

5.     

 

శ్రీసతి పనుపునఁ బ్రీతియను సఖి

వాసన లీనెడు వర తైల మిచ్చె

6.     

పట్టు వస్త్రము లిచ్చె వనజనేత్ర శృతి

దట్టంపు నగలిచ్చె తమ్మికంటి స్మృతి

7.     

 

అద్దమ్ము సమకూర్చె నందాల ధృతియె

ముద్దుగఁ గస్తూరి ముద్దియ కాంతి

8.     

జవ్వాది నొసఁగెను జవరాలు హ్రీయె

యవ్వనవతి కీర్తి యమర మకుటము

9.     

 

ఛత్రము నిచ్చెను శక్రుని భార్య

గోత్ర నందన యిచ్చె గురు చామరమ్ము

10.   

అబ్జ జాంగన యిచ్చె నన్య చామరము

నబ్జ వదనులు జయ విజయ లంత

11.    

 

వ్యంజనములను నీయంగ శ్రీలక్ష్మి

కంజదళాక్షి వేగఁ బతినిఁ జేరి

12.   

తైలమ్ము శ్రీహరి తలను బంకించి

మేలైన నలుఁగులు మేనున రుద్ది

13.   

 

కలశ శతమ్ములు గంగా జలములఁ

గలఁబోసి పరిమళ కర్పూరములను

14.   

ఒక్కొక్కటిగఁ దీసి యొయ్యారముగను

జక్కఁగ శ్రీరమ స్నాతునిఁ జేసి        

15.   

 

పొలుపుగ సాంబ్రాణి పొగవేసి తలకు

చెలువంపుఁ గురులకుఁ జిక్కులు దీసి

16.   

కౌశేయ వస్త్రమ్ము కట్టించి యింతి

లేశము మైపూత లీలగ నలఁది

17.   

 

కనకాభరణములు కమనీయముగను

తనువెల్లఁ దొడిగెను దరలాక్షి పతికి

18.   

అద్దము జూపించె నందాల భామ

ముద్దుగ దిద్దెను బుండ్రము శౌరి

19.   

 

కల్యాణ తిలకమ్ము కాంతుని నుదుట

కల్యాణవతి లక్ష్మి కనువిందు సేసె

20.  

బ్రహ్మ పురస్కృత వాస వాదులును

బ్రాహ్మణోత్తములు నప్సరస లెల్లరును

21.   

 

సనక సనందాది సంయ మీంద్రులును

మునులు వసిష్ఠాది పుణ్య పురుషులు

22.  

నారద సంయుత నాకర్షులెల్లఁ

బౌరులు భక్తులు భాగవతులును

23.  

 

తరలఁగఁ దన వెంట దామోదరుండు

గరుడ వాహనమునఁ గమలతో జనెను

24.  

పాడఁగ గంధర్వ పతు లెల్ల రచట

నాడఁగ చక్కఁగ నప్సర లెల్ల

25.  

 

మ్రోగంగ భేరీలు మోద మలరఁగఁ

జాగఁగఁ దాపస స్వస్తి వాచ్యములు

26.  

వకుళాది సఖు లుండ వర రథమందు

సకలము గదల విష్వక్సేన గణము

27.  

 

నారాయణపురము నారాయణుండు

గౌరవమ్ముగఁ జేరెఁ గల్యాణమునకు        

28.  

వరుని రాకఁ గని యప్పార్థివుం డంతఁ

గరిరాజు వీపునఁ గాంత నెక్కించి         

29.  

 

పురవీథులఁ జని గోపురపు ద్వారమున

వరునుని వధువును బన్నుగ నిలిపె

30.  

తన కంఠమాలను దామోదరుండు

ననురాగమున వేసె నతివ కంఠమున

31.   

 

పద్మావతియు నంత వర దామముఁ గొని

పద్మాక్షు మెడలోనఁ భాసిలఁ జేసె

32.  

ముమ్మారు లివ్విధి ముద్దు లొలుకఁగ

నిమ్ముగ వేసిరి యిద్ధ చరితులు

33.  

 

వాహనమ్ములు దిగి వరుడును వధువు

గేహమ్ముఁ జొచ్చిరి కేల్పట్టు కొనఁగ

34.  

కమలాసనాది నాకనివాసు లెల్ల

రమణీయ కల్యాణ రాజవేదికకు

35.  

 

సపరివారము సంతసమ్మునఁ జేర

నపురూపమై తోఁచె నా మండపమ్ము       

36.  

సాంకురార్పణముగ నబ్జజుఁ డంత

నంకిత మతి వివాహము జరిపించె

37.  

 

మాంగల్య ధారణ మహిమం దనరెను

మంగళ వాద్య సంరంభముల్ చెలఁగ

38.  

ధవళమై  మెఱయు ముత్యాలు గైకొంచు

జవముగ సేసలు సల్ల నొండొరుల

39.  

 

నీరజాక్షు తలను నీలము లాయె

వారిజాక్షి తలను బద్మ రాగములు

40.  

లాజహోమాదులు రమ్యమై యొప్ప

భాజనీయమ్ముగ వ్రతములఁ దనిపి

41.   

 

నళినజుఁ డింపుగ నవ దంపతులను

సలలిత వృత్తిని శయనింపఁ జేసె

42.  

దివ్యమై పరఁగెను దిన చతుష్కములు

భవ్యంపుఁ బెండ్లి సంబరములు జరుగ

43.  

 

రాజానుమతిఁ బక్షిరాజు వీపు పయి

భూజరమాయుత పురుషోత్తము నిడి

44.  

ఋషులును సురలు కీర్తింప హర్షించి

వృషభాద్రి యందరు వెడలెడు తఱిని

45.  

 

సంతోషము గలుగ సంతాప మడర

నింతి పలికె సుత నీక్షించి ధరణి

46.  

పోయిరా సుఖముగఁ బోయిరా తల్లి

వేయేండ్లు వర్ధిల్లు విభుఁ గూడి తల్లి         

47.  

 

పతియింట నెప్పుడు పలుకు రానీకు

పతిమాట కెప్పుడు బదులాడఁ బోకు

48.  

శయనింపఁ దగదమ్మ సంధ్య వేళలను

దయజూడఁ దగునమ్మ దైన్యుల నెపుడు

49.  

 

పరుషంపు మాటలు పలుకంగ రాదు

గరువమ్ము నెప్పుడు కలుగంగ రాదు

50.  

నడయాడు సల్లఁగ నట్టింట నెపుడు

వెడసేయ కెప్పుడు పెనిమిటి నీవు

51.   

 

నాఁ బల్కి ధరణి తనయను వీడ్కొలిపె

దూబూచు లాడంగ దుఃఖము సతికి

52.  

ఆనంద ముప్పొంగ నాకాశ రాజు

కానుక లిచ్చె నింక వధూవరులకు

53.  

 

భూరి భాండ సహితంబుగ తండులములు

భూరి సంఖ్యల భీమ ముద్గ భాండములు

54.  

దధి ఘృత క్షీర శత సహస్ర పాత్ర

లధికాయతమ్ములు నమల తరములు

55.  

 

నారికేళ కదళీ నవ చూతములు ను

దారపుఁ బణస చిత్రపు టుసిరికలు

56.  

కౌశేయ వాస నికాయములును బ్ర

కాశమాన సువర్ణ ఘన భూషణములు

57.  

 

దాస దాసీ జన దళములును సిత

గోసహస్రములును గోవృషభములు

58.  

ధవళాశ్వములును వేదండ శతములు

నవరస కోవిద నర్తకీ మణులు

59.  

 

బహుమానముల నిచ్చి పార్థివోత్తముఁడు

సహన శీలి నిలిచె శౌరి సముఖము

60.  

మామగారినిఁ జూచి మహనీయుఁ డంతఁ  

బ్రేమగ నడిగె ధాత్రీపతి కోర్కి

61.   

 

నిశ్చల భక్తియ నీరజాక్షు పయి

నిశ్చయముగ వేఁడె నృపతి వరుండు

62.  

కరుణించె వరమును గరుణా మయుండు

ధరణీపతికి నంత దామోదరుండు

63.  

 

ఆమంత్రణము నంది యబ్ధి శయనుఁడు

సామరావళి వృషభాద్రి తటమున          

64.  

దేవేరు లరిగిరి దివ్య ధామంబు             

దేవ దుందుభు లంత దిశలెల్ల మ్రోఁగ

65.  

 

పరమేష్ఠి ముగియించి వైవాహికమ్ము

కరమొప్పఁ గీర్తించె గరుడ వాహనుని

66.  

వాసవాది యమర వరులెల్లఁ బొగడ

వ్యాససుత శుక సంయమి నుతియింప

67.  

 

శ్రీభూజ సహితము సింహాసనమున

వైభవ మొప్పంగ వైకుంఠుఁ డుండె

68.  

సత్కారములు సేసి శౌరి నాకౌక

సోత్కరములు చన నొసఁగె ననుమతి

69.  

 

సేవింపఁ గందుఁడు శ్రీనివాసుఁడు య

థా విధి విహరించెఁ దద్గిరి తటిని

70.  

వేంకట గిరి యందు వెలసి నిత్యమ్ము

సంకట హరణమ్ము సలుపు భక్తులకు

71.   

 

విన్నను జదివిన వేంకటేశు కథఁ

గ్రన్నన శుభములు కల్గు నెల్లరకు

72.  

దురితమ్ము లన్నియుఁ దొలఁగు నిక్కముగఁ

బరఁగును సిరులెల్ల భాసురముగను

73.  

 

పద్మావతీ శ్రీనివాస పాపహర

పద్మనాభా పరాత్పర పద్మ నయన              

74.  

 

 

 

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత

వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

పద్మావతీ శ్రీనివాసమున  సప్తమాశ్వాసము.

పద్మావతీ శ్రీనివాసము సంపూర్ణము.

 

 

 

 

 

 

 

HPIM1019

పద్మావతీ శ్రీనివాసము

 

గ్రంథ కర్తృ దంపతులు

 

వివరములు:

పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design)

స్వగ్రామము:

బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ఉద్యోగము:

1.     Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), Hyderabad.

2.    Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad.

3.    Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of  Engineering and Technology,  Raipur.

నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013  

              Cell. Nos. 8602787525, 9440378434.

 

స్వీయ రచనలు:

1.      రామ చంద్ర శతకము.

2.      పోచిరాజ శతకము.

3.      పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు).

4.      వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము).

5.      శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు).

6.      శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము).

7.      శ్రీమన్నారాయణ శతకము.

8.      శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు).

9.      శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక.

10.   మాహేశ్వర దండకము.

11.   మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక.

12.   ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుఁడు

13.   శ్రీమదాంధ్ర రామాయణము.  

14.   శ్రీ బాల రామాయణము (సంక్షిప్త రామాయణము) 

15.   గోవిందము.