1, జులై 2024, సోమవారం

దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక.

 

దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక.

ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.

 

 

శా.

శ్రీవాణీ గిరిజా ర మార్చిత ధవ శ్రేష్ఠ క్షితి త్రాణ దీ               

క్షా విశ్వేశుల సృష్టి నాశన సు రక్షా కార్య సంసక్తులం

గైవా రార్చిత సత్యలోక హిమ వత్కైలాస వైకుంఠ ధా

మావాస త్రిమహాత్ములం గొలుతు భక్త్యావేశ చిత్తమ్మునన్                                                                                              

1.      

 

 

 

ఆ.వె.

దుర్గ! దత్త గాత్ర తుష్టాంతరంగ భ

ర్గా! గగన దుకూల కాయ రమణ!

దేవ నుతి నికాయ తృప్త! సర్గ స్థితి                                    

విలయ కార్య భార విలసి తాంబ!

2.     

 

 

 

మ.

సిత దుగ్ధార్ణవ చక్రవర్తి తనయా శ్రీరంగ ధామా రమా

నత దాసీ జన తుల్య దేవ వనితా నానా జగద్దీపికా

వితతానుగ్రహ లబ్ధ వైభవ బలద్విడ్బ్రహ్మ గంగాధరా

నతు లేనిత్తును నీకు నిత్యము జగన్మాతా ముకుందప్రియా

3.     

 

 

 

శా.

మన్మోహమ్ము నశింపఁ జేసి జగదంబా! కావుమా కాళికా!

సన్మాయా తను కామ రూప విలసత్సాహస్ర నామాత్మికా!

సన్మానార్చక నిర్జ రోత్కర సదా సంసేవ్య మానాంబికా! 

తన్మూర్తిత్రయ రూప ధారిణి! జగద్రక్షైక మాతృత్రయీ!

4.     

 

 

 

మ.

వ్రత నిష్ఠార్చిత మానవాకలన దేవవ్రాత మున్యోఘ స

న్నుత హర్షోల్లసి తాంతరంగ గిరి ధానుష్కార్ధ దేహస్థితన్

విత తానుగ్రహ దివ్య వీక్షణ సుధా విస్తారఁ గాత్యాయనిన్

శ్రిత మందారను మంగళప్రద వరశ్రీగౌరి నేఁ గొల్చెదన్

5.     

 

 

 

మ.

తర ళోద్యచ్ఛిత ఘోర శూల కరి దైత్యశ్రేణికిన్ దుర్భయం

కరి మౌనీంద్ర నికాయ మోక్ష కరి దుష్కార్యాత్మ విధ్వంస క

ర్యురు గౌరీ పతి చిత్త తోష కరి తా యోగీశ్వరీ గౌరి శాం

కరి కాపాడుచు నుండు ముజ్జగములం గారుణ్య వారాశియై    

6.     

 

 

 

తే.గీ.

కరములు మొగిడ్చి మ్రొక్కుదుఁ గ్రమ్మఱ మన

సార పార్వతీ సతి!  కరుణా రస ప్ర

పూర్ణ! ససిత రు చ్యవకీర్ణ పూర్ణ తమ సి

తామ లానన బింబాంబ రాంబ రాంబ!                                                                                                                                                                                            

7.     

 

[సిత = వెన్నెల]

 

శా.

వీణా తంత్రుల మీద నాట్యమును ప్రావీణ్యమ్ముగం జల్పుచున్

వాణీ హస్త నఖాంకురప్రతతి భవ్యాంభోజ రేఖాభలై

ప్రాణిశ్రేణుల సృష్టికర్తృ చికురాపారాళి సంచారముల్

వీణాపాణి కరాంచి తోద్భవములై విద్యోత మానమ్ములే

8.     

 

 

 

తే.గీ.

రస మృదు సుస్వరము లతిశయముగఁ దన

గను గించిదపస్వర రహిత మతిని  

స్వయముగ సతి కూర్పంగను వరము నిమ్ము

తివిరి కృపఁ జూడుమ సరస్వతీ సతతము

9.     

 

 

 

చం.

కల సువాఙ్మ యావళికి శారద దేవత వీవు తల్లి సా 

కవి వరాళి పూజిత సురప్రకరార్చిత తృప్త వీవు సు

స్వక రచనా సుపూజిత విభాసిత మానస కొల్తు నిన్ను నా

తి కరము భక్తిఁ దోరముగ దేవి కృపం గను బ్రాహ్మి భారతీ

10.    

 

 

 

ఆ.వె.

దమలాత్మ నలిన సల్లలిత మృదు క

నలినజ హృదంతర నిజ దార

స్వర వరాధి నేత్రి స్వంగ విలాసవ

తీ దయా సరస్వతీ ప్రణతులు

11.    

 

 

 

చం.

రసిజ పుస్త కాక్ష సర చారు శుకస్థిత హస్త రాజితా

వర సిత శా దాంశునిభ వక్త్ర విభూషణ దీప్త విగ్రహా

సురుచిర పాండ రాంబర విశుద్ధ ససుస్వర భావ నాక సం

చర చతురాననప్రణయ జాయ నతుల్ గొనుమా సరస్వతీ

12.    

 

 

 

చం.

గొనముల గెల్వ ముజ్జగముఁ గూరిమి నిల్పఁగఁ దమ్మిచూలిపైఁ

దనరఁగఁ జిల్క పొత్తములు తామర పూసల పేళ్లు కేలులం

బెనుపున మీట వీనియను విద్దెల కుప్పను దెల్ల వల్వలం

గనిననె సంతసమ్ము మదిఁ గల్గును  దండము లట్టి తల్లికిన్

13.    

 

 

 

ఉ.

విద్యల కెల్ల దేవతవు వేద గిరార్చిత మాతృ మూర్తివే

హృద్య ఫలాశ నాక్ష కుసు మేప్సిత పుస్తక యుక్త పాణివే

చోద్య విపంచికా స్వర యశో భరి తాఖిల లోక వేదసం

వేద్య సురాళి పూజిత వివిక్త విరించి మనో విలాసినీ

14.    

 

 

 

తే.గీ.

వరముల నొసంగు లక్ష్మి యిద్ధర విశద మ

గును గరము వరలక్ష్మి నాఁ గువలనేత్ర

పూజ సేయఁగ లలనలు బుద్ధి నుంత్రు

చేరి కాపాడు సతము లక్ష్మి యని భక్తి

15.    

 

 

 

మ.

సమ దా ళ్యావలి పాఱెఁ గాంచి లలనా శ్యామాలక శ్రేణులం 

గమనీ యాబ్జము లప్పు దూఱె నరయం గాంతా ముఖాంభోజముం

దిమి వేశ్మమ్మున దాఁగె శంఖములు దొంతిం గాంచి తద్గ్రీవముం

దమి యేపారఁగఁ గాంచి లే ళ్లుఱికె సీతాదేవి కందోయినే

16.    

 

 

 

చం.

 

వనజ దళాయతాక్షి నిజ భక్తజనావన సత్క్రియా రతై

క నిజ మనోరథప్రకరఁ గంజ ముఖాంబుజ వారిరాశి సం

జనిత రమాభిధాన విలసల్లలితాంబుజ హస్త హస్తి భా

జన జల భాసమాన శిరఁ జక్రధరాంగన లక్ష్మిఁ దల్చెదన్   

17.    

 

 

 

కం.

మన గోగులమ్మ మున్కని

విని యెఱుగని మహిమ లలర వెలసెన్ భక్తా

వన రత మద్గ్రామ నివా

సిని మా దేవతఁ గొలిచినఁ జేకూరు సిరుల్

18.    

 

 

 

మ.

మును బుట్టెన్ ధవలాంబురాశి విమలాంభోజాక్షి గాంగేయ మం

డన షండద్యుతి వెల్గఁ గంబు నిభ కంఠం బంత విద్యోతమై

వనితా రత్నము శుద్ధ పద్మకరయున్ వైకుంఠ సద్ధామ వా

సిని, మా దేవత ప్రేమమూర్తిఁ గొలువం జేకూరు సత్సంపదల్

19.    

 

 

 

ఆ. వె.

పోవ దొడ్డవరము ముత్యా లనఁగ వేల్పు

లేమఁ గాంతు మచట లేక సాటి

రమణి వెంట నుండ నమృతాశి గోగుల

మ్మ యతి భక్తి నే నమస్కరింతు

20.   

 

 

 

ఉ.

విశ్వసృడంగ సంజనిత విశ్వ జనార్చిత సుందరీ మణిన్

శశ్వ దజాత్మ సంస్థిత విశాల చలన్నయ నాంబు జాన నా

నశ్వర వల్లకీ మధుర నాద వినోద ముదాత్మ నాథనున్

శాశ్వత శుద్ధ విద్య నిడ శారద వేఁడెద రక్తి భక్తిమై

21.    

 

 

 

శా.

పాథోధ్యుద్భవ వాసవానుజ కరాబ్జగ్రాహిణీ! పావ నా

నాథత్రాణ సతీ! సరోజ దళ విన్యస్తేభ హస్త స్రవ

త్పాథస్సిక్త నవీన పద్మ విలసద్ధస్తాబ్జ సమ్మోదినీ!

గాథా గాన మనో వికాస ధనదా!  కారుణ్య రాశీ! నతుల్

22.   

 

 

 

శా.

కైలాసాగమ వాస వామ సు తటీ గాత్రార్ధ భాగప్రభా

లీలావాస విలాస హాస! కర వల్లీ శూల సంధాయినీ!

కాలీ నామ విశేష సంచరిత భక్తవ్రాత దైత్యాలి దృ

గ్బాలేందు ప్రళయాంత కాభ  వదనా! పాలించు కాత్యాయనీ!                     

23.   

 

 

 

మ.

త్రిపదాక్రాంత సరోజజాత వరగౌరీనాథ నిత్యాల యా

నుప మావాస సుమంగళప్రద సుపర్వౌ ఘార్చి తానంద స

త్యపద వ్యాప్త నితాంత విశ్వ మయ భూతాత్మం ద్రిమూర్త్యాత్మి కా

ది పరాశక్తి మృగేంద్ర వాహనను  సంతృప్తాత్మ నేఁ గొల్చెదన్                                                                                               

24.   

 

 

 

మ.

మహి షాదిత్య విరోధి లోక దమనున్ మర్దించితే భూ నభో

విహి తోద్ధండ నిశా చరాలి నిజ హృద్భేదమ్ముగా రౌద్రతన్

సహ కంఠీరవ శూల హస్త జన రక్షాదక్ష! ముక్తిప్రదా!

యిహ సౌఖ్యావహ నిత్యపూజ్య! వరదాత్రీ! శాంభవీ! మన్నతుల్                                                                                              

25.   

 

 

 

కం.

క్షీరా బ్ధ్యుద్భవ కన్యా

నారీ లోకాభిపూజ్య నలి నావాసా

నారాయణ వక్షో వా

సా రామా లోక రత్న సామజ సేవ్యా                                                                                              

26.   

 

 

 

కం.

వర భక్తోత్కర సేవిత

వరౌఘ సంప్రాప్త సిద్ధ భక్తశ్రేణీ

వరదాయినీ హరి సతీ

వరలక్ష్మీ వందనములు వరసుర పూజ్యా

27.   

 

 

 

మ.

కరి హస్తద్వయ పూరితాంబు కణ సిక్త స్వీయ మూర్ధ ప్రభా

సుర సంఘార్చిత పాద పద్మ యుగ సంశుద్ధా నిజాష్ట స్వరూ

ప రమా పద్మదళాయతాక్షి వరదా పద్మాలయా కావుమా

వరలక్ష్మీ వర హర్యురస్థ సక లైశ్వర్య ప్రదాత్రీ నతుల్                                                                                                                                                                                            

28.   

 

 

 

కం.

దంభంబు విడిచి నే సం

రంభంబున వేడుకొందు రాజమకుటునిన్

గంభీర గరళ కంఠున్

శంభుఁ ద్రినేత్రు గిరిజేశు శంకరు నీశున్                                                                                             

29.   

 

 

 

ఉ.

దంభము వీడినేఁ గొలుతు దానవ ఖండన ఖేలనాతి సం

రంభుని, దక్షయజ్ఞ పరి రక్షణ శిక్షణ హేతు భూతునిన్ 

స్తంభిత జాహ్నవిన్ , వికట దండధరోద్ధత  దర్పహంతకున్

శంభుని, ఫాలనేత్ర తట సంజనితానల దగ్ధ మన్మథున్

30.   

 

 

 

ఆ.వె.

శంభుఁ డిందుమౌలి శంకరుఁ డీశుండు

నీలకంఠుఁ డసమ నేత్రుఁ డజుఁడు

త్రిపురవైరి శివుఁడు  దేవదేవుండు కు

మారజనకుఁ దలఁతు మారవైరి.    

31.    

 

 

 

ఉ.

వందన మాచరింతు మదిఁ బర్వత రాజ తనూజ భర్తకుం

జందన భస్మ గంధ పరి సర్పిత గాత్రుఁడు చంద్ర మౌళికిన్

నందిత భృంగి శృంగి వర నంది పిశాచ గణాధి నేతకున్

సుందర ఫాల నేత్ర పరిశోభిత వక్త్ర పినాక పాణికిన్.    

32.   

 

 

 

శా.

శ్రీశైలాగ్ర తటీ స్థ పుణ్యజన సంసేవ్యుండు మల్లన్ననుం

గాశీక్షేత్ర విరాజితున్ శివుని ద్రాక్షారామ భీమేశ్వరున్

రాశీభూత దయా పయోనిధిని సద్రామేశ్వ రాఖ్యున్ భవా

నీశానీ కర పూజి తాంఘ్రియుగ దేవేశున్ భవున్ వేఁడెదన్ 

33.   

 

 

 

కం.

హరహర! మహా సురా! హిమ

గిరివరవాస! నటరాజ! గిరిజానాథా!

పురచయ హరా! దయాకర!

సురాపగాజూటధీర! సుందర! ప్రణతుల్

34.   

 

 

 

కం.

మూర్ధ విరాజిత సోమున్

దుర్ధర్షాభీల గరళ దోషిత గళు నా

యర్థేశ సఖుఁ దలఁతు వా

మార్ధ స్థిత శైలసుత నుమాశంకరునిన్   

35.   

 

 

 

సీ.

ఆకాశ గంగకు హద్దులు సూపించి నడినెత్తి నుంచిన జడల ఱేఁడు

నగరాజ కన్యకు సగభాగ మిచ్చిన యర్ధ నారీశ్వరుం డందగాఁడు

గజ దైత్యు కోరిక కరుణించి తీర్చిన జగ దభి నుత గజ చర్మ ధారి

శరణాగతుండు శశాంకు గాచిన మేటి సౌజన్య మూర్తి యా చంద్రమౌళి

 

తే.గీ.

గరళమును మ్రింగి జగములఁ గరుణఁ గాచె

హద్దు లవి లేవు వరముల  పద్దు లందు

దుష్టుఁ డైనఁ గాచు పొగడ్త నిష్టుఁ డైన

హరుని గుణముల నెంచఁగఁ దరమె జగతి

36.   

 

 

 

వసంతతిలకము.

విశ్వేశ్వరుం బ్రమథ వీర గణాధినేతన్

శశ్వద్వరప్రదుని శంకరు సాంబమూర్తిన్

విశ్వాత్మునిం ద్రితయ వీక్షణు నీలకంఠున్

సుశ్వేత శైలతట శూలినిఁ గొల్తు భక్తిన్           

37.   

 

 

 

కం.

ఇల్లరికపు టల్లుఁడు మరి

మల్లుం డట వల్లకాటి మదనాంతకుఁడే

విల్లంది పురత్రయముం

దల్లడిల మరల్చె యమసదనమునకు సెలన్

38.   

 

 

 

మ.

పరమోత్కృష్ట విలాస తాండవ సనిస్వానాద్రి సంచారముల్

గిరికన్యా కర సారసద్వయ సు సంకీర్ణప్రకాశమ్ములున్

శరణాకాంక్షిత మౌని హృద్విపిన సంచారంపు శీతాంశు శే

ఖర పాదమ్ముల సేవ మానవులకుం గళ్యాణముల్ గూర్చుతన్

39.   

 

 

 

శా.

కైలాసాగమ నిత్య నర్తన లసత్కాత్యాయనీ కేళి లీ

లాలో లాది వినోద తోషిత మనోల్లాసప్రభా విగ్రహా!

కాలాలోకన దగ్ధ మన్మథ! పురాకారాసురఘ్నా! శివా!

ప్రాలేయాంశు విరాజమాన వర మూర్ధా! శంకరా! కావవే

40.   

 

 

 

సీ.

ప్రేత భూ సంచారి రిక్తాంబరుండు త్రినేత్రుండు వరదుండు నిత్య శుభుఁడు

భస్మ చందన దేహి ఫణివృత  బాహుండు శీతాంశు జాహ్నవీ శేఖరుండు

నలి జటాజూటుండు నమరారి బంధుండు నత నిర్జర గణుండు సిత తనుండు 

నట నానురాగుండు పటు విషగ్రీవుండు  నక్షిత్రయుం డభయ ప్రదుండు

 

తే.గీ.

ప్రమథ నిచయ భూతప్రేత పాలకుండు

నస్థి మాలి కర కపాలసుస్థిరుండు

నశుభ దృశ్య మాన నిరంతర శుభ దాయ

కుండు నా విశ్వనాథుని రండు కొలువ 

41.    

 

 

 

శా.

విద్వన్మండల హృత్సరోజ విలసద్విఖ్యాత కీర్త్యంగనా

చిద్వైచిత్ర్య తనూ విలాస కరు ణాశ్లిష్టాత్మ భక్తాళి రా

జద్వైశిష్ట్య గుణోత్క రాగుణ గణ క్షామాంతరంగ ప్రభా

యుద్విగ్నార్త జనావ నైక రత సద్యోరక్ష శూలీ నతుల్    

42.   

 

 

 

శా.

దుర్వారాసమ నేత్ర సంజనిత సద్యో వహ్ని భస్మాంగజా

గర్వోద్రిక్త పురత్రయాసుర మహాకాయా సువిధ్వంసకా

నిర్వీర్యీ కృత కాలకూటవిష సన్నిక్షిప్త కంఠప్రభా

శర్వా శంకర పార్వతీధవ హరా శాంతించి కాపాడుమా           

43.   

 

 

 

కమల విలసితము.

దశరథ తనయ సదమల చరిత్రా

కుశలవ జనక సుగుణ గణ ధామా

శశినిభ ముఖ హరి సదృశ సుమధ్యా

దశముఖ విదళన ధరణిజ నాథా

44.   

 

 

 

కం.

కమలార్చిత పద కమలము

కమలాసనున కభయంపు కరములు కరమా

ల మరులు కొనియెడి సుమములు

సుమ దామ విలసిత కంఠు సుందరు గొలుతున్   

45.   

 

 

 

కం.

కరివర వరదు మకరి హరు

హరినిభకటి మురహరి నరహరి ఘనకిటినిన్

హరిగణ విభునుతు భవభయ

హరు ముదముగ గొలుతు హరిని హరిఫణ శయనున్

46.   

 

 

 

కం.

మత్తేభారిస్కంధుఁడ

మత్తేభప్రాణ దాత మాధవ గొనుమా

యుత్తుంగాభంగ తరం

గోత్తంసోత్కర దయాపయోనిధి నుతులన్

47.   

 

 

 

మ.

వసుదే వాత్మజుఁ బూతనా విష పయఃప్రాణాపహారిన్ హరిం

బ్రసవస్నిగ్ధ పదాహ తాంగన యశో రాజద్బలుం జక్రిఁ జ

క్రసమీ రాసుర ఘోర భంజను మహా కాలాహిదర్పాంతకున్

వసుధా భృద్ధర పాణిపల్లవ మహా బాలున్ మదిం గొల్చెదన్                                                                                              

48.   

 

 

 

కం.

రామ! భవాఘ విరామా!

శ్యామల తను రుచి లలామ! సద్గుణ ధామా!

రామా! సత్య పరాక్రమ!

భామావనిజ హృదయాబ్ధి భాసిత సోమా!                                                                                             

49.   

 

 

 

మ.

రఘు వంశాబ్ధి శశాంక! కోప జిత పారావార! కోదండ పా

ణి! ఘనాకార విరాజితా! కపి వరానీకైక సద్రక్షకా!

యఘ దూరీ కృత భక్త సంచయ! దశాస్యప్రాణ విధ్వంస! సూ

ర్య ఘృణివ్రాత నికాశ సద్విమల దేహా! రామ! సీతాపతీ!                                                                                                 

50.   

 

 

 

శా.

ఇక్ష్వాకు ప్రవ రాబ్ధి పూర్ణ శశి దైత్యేంద్రక్షయార్థైక జ

న్మ క్ష్వేడా స్వన సత్య వాక్చతుర సంభావ్యుండు ధానుష్కుఁడున్

సక్ష్వింక వ్రజ భాను సూను సఖుఁడున్ సద్ధర్మసత్పాలుఁడున్

సుక్ష్వేళాత్త గళాంబికా పతి దయాంశు శ్రేణి లబ్ధుండు ప్రా

ప్త క్ష్వేళి ద్విష పుంగ వానురతినిం  బ్రార్థింతు సీతాపతిన్

51.    

 

 

 

మందాక్రాంతము.

ఇక్ష్వాక్వంభోనిధి సిత నిశీథేశ సంకాశ మూర్తిన్

సుక్ష్వింకానీక ధవ రవి సత్సూను సంభావ్య ధీరున్

భిక్ష్వామ్నాయప్రముఖ శివ సంప్రీత ధానుష్క వీరున్

స్విక్ష్వత్యుగ్రాస్త్ర ధర నిభు నే నింపుగం గొల్తు రామున్

52.   

 

 

 

మ.

ఇన వంశార్ణవ పూర్ణచంద్ర నిభ మత్తేభేంద్ర సంచార మో

హన నీలద్యుతి భాసి తావయవ సత్యద్యోత దుర్విక్రమా

వన కార్యైక సునిశ్చయాత్మక లసద్బాణాసన స్కంధ సా

వనిసంజాత సలక్ష్మణ స్థిత సుదుర్వైరిఘ్న రామా నుతుల్

53.   

 

 

 

మ.

ధరకన్యామణి హృద్వనాంతర లసత్కల్పద్రుమా  రాఘవా

వర రాజన్య విరాజమాన రవి సద్వంశాటవీ కౌముదీ

దురభిక్రాంత సురారి ఘోర గిరి సందోహైక నిర్ఘాతమా

హర పద్మాసన శక్ర దేవగణ నిత్యారాధ్య రామా నుతుల్

54.   

 

 

 

మ.

గుణ సంసిద్ధ సదా విరాజిత మహా కోదండ హస్తాంబుజా!

గుణ సంధాన పరాక్రమ ద్యుతి మహాకోదండ విధ్వంసకా! 

క్షణి కోద్రేక మహీసు రార్చిత మహేష్వాస ప్రభా  గ్రాహకా!  

రణ విచ్ఛేదిత దైత్య సంచయ! విభూ! రామా! మముం గావుమా

55.   

 

 

 

శా.

నీలాంగ ద్యుతి పుంజ నిర్జిత చలన్నిర్భేధ్య పర్జన్యమా!

వేలాక్రాంత యశః పయోధి! కృత నిర్వీ ర్యోగ్ర  రత్నాకరా! 

లీలా మానుష రూప సంచరిత కేళీ ఖండితాస్య వ్రజా!

బాలా భూమిజ హస్త పూజిత పదా! పాలింపవే రాఘవా!

56.   

 

 

 

నారాయణ వృత్తము.

నీలి మేఘశ్యామ రామ

వాలి జీవధ్వంస భీమ

లాలితోత్సంగస్థ సీత

జాలి చూపింపంగ రావ!                                                                                              

57.   

 

 

 

కం.

నేరము లెంచకు చూపుమ

తీరము ఘోరపు భవముల దింపకు రామా

కోరెద నీ పయి భక్తియ

తోర మఘలతా లవిత్ర తోయజ నేత్రా                                                                                                 

58.   

 

 

 

మ.

అత లామ్నాయ ధరాది లోక సహి తాజాండోల్ల లాభీల భం

జిత నీడోద్భవ జంతు సంచయ పయో జీవ్యౌఘ సద్యః కృ తా

నత దేవాలి నృసింహ విగ్రహ! హిరణ్యప్రాశనఘ్నా! త్వ దా

శ్రిత భక్తోత్కర పాలకా! వెలసితే సింహాద్రిఁ గొన్మా నతుల్                                                                                               

59.   

 

 

 

మందారము.

సర్వ గురు నూత్నస్వీయ కృతవృత్తము.

భామా రత్నంబుల్ వే విత్తంబుల్ భాగ్యాగారశ్రేణుల్ బంధువ్రాతం బ

య్యా మాయల్ ధాత్రిన్ దాఁటంగన్ సాధ్యం బౌనే యాదిత్యాపత్యశ్రేష్ఠుండా

కామగ్రామంబుల్ రేఁగెన్ నాలోఁ గావన్ రావే వేగం గాకుత్స్థజ్యోతీ

రామా సీతానాథా నా కిమ్మా రాజీవాక్షా ముక్తిం గారుణ్యాంభోధీ

60.   

 

 

 

మ.

నర నారాయణ నామ కీర్తనము పుణ్యప్రాప కాలాప మా

నర కృష్ణద్వయ రూప వీక్షణము సంత్రాసాలి విధ్వంసమే

యరి భీభత్సుల భార తాహవ మహాయజ్ఞార్థ సంభూతులన్

నిరతం బేను స్మరింతు భక్తి మదిఁ దన్నీరేజ పత్రాక్షులన్

61.    

 

 

 

మ.

చిలుకూరన్ వర పట్టణాంతరమునం జిద్రూప సంశోభియై

విలసిల్లెం దగ వేంకటాద్రి పతియే విద్యార్థి  బృందమ్ములే

యిలలో నమ్మెడు నమ్మకమ్ము లవి వే యింపార సత్యంబుగాఁ

జెలఁగన్ నిత్యము దాఁ గృపా రస సుసంశ్లే షాంతరంగమ్మునన్

62.   

 

 

 

శ్లోకము.

పిల్లఁడా పైఁడి జేజేకున్ మల్లు మామల నొవ్వరీ! |

తల్లి కుప్పొంగ! మన్నొజ్జా!   నల్ల దేవర! దండముల్ ||   

63.   

 

 

 

శ్లోకము.

రగువు తెగపుం గందూ! తెగతేర్సామి బిడ్డఁడా!

రగువు తెగ దిబ్బెమ్మా! మగడా మన్నుపట్టికిన్!

64.   

 

 

 

శ్లోకము.

నిడుద బుజ రాయండా! నిడుద తమ్మి కన్దొరా!

వడి సోఁకులఁ జెండాడం  గడు నేర్పరి! దండముల్    

65.   

 

 

 

ఉ.

పాటియె లేని యా రఘువు పాపఁడ! పేర్బుజ దిట్ట! చాల్పు పెన్  

మేటరి తేరు పెన్కొడుక మే రన నేరని నేలచూఁలి నే

ల్పోటు మగండ! మిన్న దివె! పున్నెపు వేఁడి వెలుంగు కందులం  

బోటరి గొంగ! రక్కసుల మ్రొక్కెదఁ దామర కంటి! నిచ్చలున్

66.   

 

 

 

తే.గీ.

సమధి కానంత విశ్వాండ సమ్య గావ

రణ విరాజమాన చరాచర నయన యుగ

గోచ రాగోచర ప్రాణి కోటి సంభ

వైక కారణ పరమాత్ము నాత్మఁ గందు                                                                                                                                                                                           

67.   

 

 

 

మ.

భవబంధమ్ములఁ జిక్కి మేము  కలి దుర్వారాఘ రాశిన్ మునిం

గి వివేకచ్యుత చిత్త కర్దమమునం గ్రీడింపఁగా నిన్ను గా

కెవరిన్ వేఁడుదు మయ్య ప్రోవు మని రావే భక్త మందార భ

వ్య వరౌఘప్రద శ్రీ రమా సహిత దేవా సత్యనారాయణా!

68.   

 

 

 

కం.

వరవనితా జన మోదక

మురళీ ధర పింఛ దామ మోహన రూ పా

మర గణ సేవిత రా మా

వరజ పరంధామ కృష్ణ  ప్రణతులు గొనుమా

69.   

 

 

 

కం.

కమలాప్త భూ నభో జన

రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా

కమలాప్త భూ నభో జన

రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా                                                                                                                                                                                            

70.   

 

 

 

శా.

మీనశ్వేతవరాహ రూప శివ భూమీ త్రాతృ కూర్మప్రభా

నానా వస్తు సుధా రమా సుసృజనా నైపుణ్య  భాస్వన్నృసిం

హానింద్యాకృతి వామనప్రవర  రామాఖ్యావనీశఘ్న రా

మానంతాసుర హంతృ కృష్ణ నృప బుద్ధావార్య  కల్కీ నతుల్

71.    

 

 

 

మ.

కరి దైత్యార్భక రక్షణార్థ సుమహా కారుణ్య దృగ్జాల భా

సుర దైత్యద్వయ కుంభకర్ణ వర రక్షోనాథ చైద్యావనీ

వర దైత్యాంశక దంతవక్త్ర ఝష దుర్వారాది ముక్తిప్రదా

హరి దామోదర పద్మనాభ యరవిందాక్షా ముకుందా నతుల్

72.   

 

 

 

ఉ.

రక్షిత దీనశిష్టజన రాగ వివర్జిత భక్తకోటి సం

శిక్షిత దుష్ట భావయుత చిత్త విలక్షణ దైత్య కోటి ని

ష్పక్ష మనో విరాజిత కృపానిధి శార్ఙ్గ గదారి శంఖ స

ల్లక్షిత రమ్య రూప కమలాధవ విక్రమ నీకు మ్రొక్కెదన్

73.   

 

 

 

శా.

యుక్తాయుక్త వివేక శూన్య మృగ వంశోద్ధార నక్రద్విపుల్

ముక్తిం గాంచిరి మాన వార్భకులు సంపూర్ణంపు మోహాంధు లా

సక్తిం గోర ధనాది వైభవములం జక్రాయుధా యిత్తువే

ముక్తిం గోరిన వారి కిత్తువు కదా ముక్తిన్ మురారీ నతుల్

74.   

 

 

 

ఉ.

సప్త నగాంత సానుతల సంస్థిత మందిర సుందరాకృతిం

దప్త సువర్ణ హార సిత దామ విభూషణ రాజి రాజితుం

బ్రాప్త సుఘోర పాప చయ భంజకు భక్త జనావ నైక సం

క్షిప్త  మనో వికాసు నత శీర్షతఁ గొల్తును వేంకటేశునిన్

75.   

 

 

 

శా.

హృచ్ఛాంత్యర్థము దుఃఖ నాశ రతి రోషేర్ష్యాది దుశ్చింతనా 

విచ్ఛిన్నార్థము భక్తిఁ గొల్తు వరదా!  విశ్వేశ! దైత్యాలయ

ప్రచ్ఛన్నస్థిత!  దాన వాన్వయవర ప్రహ్లాద సంపూజితా! 

తుచ్ఛస్వాంత హిరణ్య భుక్తి నఖ సద్యో జిన్నృకంఠీరవా!

76.   

 

 

 

శా.

కల్పాంతాంబుధి కుక్షి సంచరిత మార్కండేయ మౌనీశ్వ రా

నల్పానంద విధాయకా! వట దళ న్యస్తాంగ యోగీశ్వరా!

తల్పీభూత వటచ్ఛదా! పరమ శాంతస్వాంత లక్ష్మీధవా!

యల్పజ్ఞాన విమోహ నిర్దళన! లోకైకేశ్వరా! కావుమా

77.   

 

 

 

శా.

విద్యుత్సన్నిభ కాంతి పుంజ విలసద్వీక్షా దయా నిర్ఝర

ప్రోద్యద్వైభవ భక్త సంచయ! మహాభోగాలి శయ్యాలయా!

యుద్యద్బాహు సభీష ణాయుధ జితాత్యుగ్రారి సంఘాత! సం

వేద్యామ్నాయ చయాంతరంగ! త్రిజగద్విక్రాంత! దేవా! నతుల్

78.   

 

 

 

శా.

దైత్యశ్రేణి నరాశ్వ యక్షగణ గంధర్వాహి సన్మాన వా

దిత్యారాధిత పాద పద్మ యుగ సంతృప్తాంతరంగా! శివా!

నిత్యోద్దీపిత వాద్య నర్తన మనో నిష్ఠైక హృష్టా! భవా!

భృత్యవ్రాత మహా బలప్రమథ సంప్రీతాత్మ రుద్రా! నతుల్ 

79.   

 

 

 

శా.

 

నలుమోమయ్య సదా చతుర్దశ జగన్మౌళి స్థిరావాసునిన్

బలి బంధించిన వాని లచ్చి మగనిన్ వైకుంఠ రోచిష్ణునిం

గలఁతల్ దీర్చు ధరాధ రాత్మజ పతిం గైలాస వాస్తవ్యునిన్

బలు లా మువ్వుర దివ్య మూర్తులఁ దమిం బ్రార్థింతు మోక్షార్థినై

80.   

 

 

 

మ.

సకలప్రాణి లలాట లేఖన కళా సాకల్య నిష్ణాతునిన్

సకలప్రాణి సమంచి తావన కళా సాకల్య నిష్ణాతునిన్

సకలప్రాణి సమంచిత క్షయ కళా సాకల్య నిష్ణాతునిన్

సక లాదిత్య మునీంద్ర సన్నుత మహా శక్తిత్రయిం గొల్చెదన్               

81.    

 

 

 

శా.

వాణీ హస్త యుగాంగుళీ ముకుళ సద్వ్యాపార మూ ర్ధాబ్జజుం

ద్రాణైకైక గుణాస్ప దాంచిత ఘనోరః ప్రాప్త లక్ష్మీ సతిం

బ్రాణాధిక్య సతీ విరాజిత లసద్వామాంగ విభ్రాజితుం

బ్రాణాయామ ముఖ క్రియా రతుఁడనై ప్రార్థింతు నా మువ్వురన్

82.   

 

 

 

ఉ.

కాచితి వొక్క యేనుఁగును గ్రక్కునఁ జంపితి వన్య హస్తినిం

దాఁచితి వొక్క సర్పమును దల్పము సేసితి వన్య భోగినిం

బ్రోచితి వొక్క మానినిని మూరి వధించితి వన్య భామనుం

గాచిన నేఁచినం బుడమిఁ గైటభ మర్దన నిన్నె కొల్చెదన్                                                                                              

83.   

 

 

 

మ.

అసమాక్షి జ్వలిత స్వనంగ సుర కార్యా ర్థాగ తాంగోద్భవా!

యస మాశీ విష కాలకూట గళ విఖ్యాత ప్రజా రక్షకా!

లస దంభోజ కళా జటా!  సుర నదీ రాజచ్ఛిరో రత్నమా! 

విసృ తోరస్క! ఫణాకరాంక! ప్రణతుల్ విశ్వాత్మ! గౌరీధవా!

84.   

 

 

 

ఉ.

పాయక నిల్వ నారములఁ బద్మదళాక్ష చెలంగి తీవు నా

రాయణ పుణ్య నామమున రాజిలఁ జక్రము చక్రి వైతివే

యాయత విశ్వ నామక మహాండము నిండిన విష్ణు! తావ కా

మేయ సహస్ర నామముల మేదిని మాధవ నిన్నె కొల్చెదన్

85.   

 

 

 

కం.

ఛన్న సధగద్ధగద్జ్వల

సన్నిట లాంబక! ధిమిధిమి చయ నిర్ఘోషాం

చన్నటనాంఘ్రిద్వయ! విల

సన్నాగాభరణ కంఠ! సర్వజ్ఞ! నతుల్

86.   

 

 

 

ఉ.

కైకొని ముద్ద నే మఱతు కంజదళాక్షుఁడ మ్రింగ దానినే

చేకొని పూలు నే మఱతుఁ జిన్మయ యుంచఁగ నీ పదమ్ములన్

వీఁక పఠింప నే మఱతు వెన్నుఁడ నీదు సహస్ర నామముల్

వాకొని యేడ్వ నే మఱతు పన్నగ తల్పుఁడ నిన్ను దల్చుచున్

87.   

 

 

 

శా.

షడ్జాదిస్వర యోగ వేణు నినద స్తంభీ కృతోర్వీ తల

త్విడ్జీవావలి రక్షణైక రత సందీప్తాంతరంగా! సరో

రుడ్జాతాత్మ విరాజమాన పురుషా! రుద్రార్చ్య  దేవా! ధరా

రాడ్జాలాసు వినాశ కార్య భర భృద్రామా! రమేశా! నతుల్                                                                                                                                                                                            

88.   

 

 

 

ఉ.

పద్మ సుఖాస నాంబురుహ భావ విధాతృ సరస్వతీ ధవుం

బద్మ దళాక్ష తామరస ఫాండ జగత్త్రయ నిత్య రక్షకుం

బద్మభ వాంగ కోద్భవ శివప్రద చండ దశైక రుద్రులం

బద్మ సు వర్ణ నామ ముని వంద్య సురేశులఁ గొల్తు ముక్తికై                                                                                              

89.   

 

 

 

చం.

అఘ నిచ యాటవీ వర దవానల! దాశరథీ! దయానిధీ!

రఘుకుల వార్ధి పూర్ణ సిత రాజిత రాజ నిభా! ఘనప్రభా!

మఘవ సమర్పిత ధ్వజి స మాతలి సంస్థిత సుప్రశస్తకా!

విఘటిత దానవేంద్ర రథ! వీరవరేణ్య! నరోత్తమా! నతుల్                                                                                              

90.   

 

 

 

మ.

వర కాలార్దిత పూతనా కుజననీ ప్రాణాపహార క్రియా

స్మర బాణార్దిత గోపికా నివహ సన్మానాపహార క్రియా

యరవిందాసన చిత్త దూషిత నిజాహంకార నాశ క్రియా

మురళీ నాద వినోద హర్ష మయ  సంపూర్ణ వ్రజా మన్నతుల్                                                                                              

91.    

 

 

 

మ.

అరవిందాక్ష! రమా సతీ లలిత హస్తాంభోజ సంపూజితా!

కురు సంగ్రామ మిష క్షమా భర ల యాఘో షాపదే శాచ్యుతా! 

పరమా ర్థేద్ధ సుధా రసానుభవ  సంప్రావీణ్య జిజ్ఞాస స

త్వర మోక్షప్రద! ఫల్గుణార్థ వర గీతాజ్ఞాన దాతా! నతుల్

92.   

 

 

 

శా.

సత్యం బియ్యది హంసరాజు నెఱపున్ సారథ్యమే యబ్జజా

నిత్యంబుండు విహంగ రాజవరమే నీ వాహనంబై హరీ

ప్రత్యేకమ్ముగ నయ్యె వాహనము గో రాట్చంద్రమే శంకరా

భృత్యశ్రేష్ఠులు నన్ను నప్పగిది వే వీక్షింప నే వేఁడెదన్                                                                                              

93.   

 

 

 

మ.

నరమౌనీంద్రుఁడు వొందెనే కృతమునన్ నారాయణా నిన్నెదన్

మరు దాత్మోద్భవుఁ డందెఁ ద్రేతఁ దమి రామా నీదు సాన్నిధ్యమున్

నరుఁడే ద్వాపర మందుఁ బొందెఁ గద కృష్ణా నీదు బాంధవ్యముం

బరమాత్మా తవ లీల లెన్నఁ దరమే ప్రార్థింతు నిన్నాత్మలో                                                                                              

94.   

 

 

 

శా.

క్షీరాబ్ధ్యాత్మజ నుంచితే యురమునన్ శ్రీకంఠు నర్చించితే

పారావారము దాఁటి చంపితి కదా పౌలస్త్యు నుగ్రాజిలోఁ

గారాగారము నందుఁ బుట్టితి కదా కంసాధముం జంపఁగా

నే రీతిం దరమౌ నినుం బొగడ విశ్వేశా ముకుందా నతుల్  

95.   

 

 

 

మ.

ప్రళ యాభీల సుఘోర మేఘ మరు దావర్తాత్త సాంద్ర ప్రభా

జల ధారా వటపత్ర తల్ప సుఖ వాసశ్రాంత! పాదాంగుళీ

విలసద్వక్త్ర విలాస హాస వదనా! విశ్వోదరా! శ్రీకరా!

జ్వల దంభోజదళేక్షణా! నుత కృపా పారీణ! దేవా! నతుల్                                                                                              

96.   

 

 

 

ఉ.

దుర్మద దైత్య భంజక చతుర్దశ లోక మహా ధురంధరా!

కర్మ ఫలాశ సంత్యజిత కర్మ నరావలి ముక్తి దాయకా!

ధర్మ నిరంత రావన సదా ఘన కార్య ధురంధరా! హరీ!

నిర్మల వర్ష కాల ఘన నీల శరీర విరాజి! మన్నతుల్

97.   

 

 

 

చం.

సకల చరాచ రాసు గణ సంభవ వర్ధక నాశ కారకా!

సకల పదార్థ రాజ దణు సంచయ శుద్ధ హృదంతరాళ వా

సక! కరుణాంతరంగ! వికసన్నవ పద్మదళాయతాక్ష! శ్రీ

శుక ముఖ మౌని పూజిత వచోరుచి సన్నుత మాధవా! నతుల్

98.   

 

 

 

శా.

విజ్ఞానాది విశేష శాస్త్ర చయ గంభీ రాగ మాతీత స

త్యజ్ఞానాకర! విస్తృ తాఖిల జగన్న్యస్తోదరా! సుస్థిరా!

ప్రజ్ఞాపాటవ సంయ మీంద్ర గణ హృద్భా వానవాప్తా! వరా

త్మజ్ఞా నావగ తాభయప్రద పరా! దామోదరా! మన్నతుల్                                                                                              

99.   

 

 

 

శా.

భూతప్రేత పిశాచ సేవక గణాపూర్ణ ప్రమోదాత్ముఁ గా

లాతీ తాభవ నిత్య నర్తన కళాహ్లాదాంతరంగున్ హరున్

సీతా నాథ కరాబ్జ పూజితపదశ్రేష్ఠద్వయున్ దుఃఖిత

వ్రాతత్రాతను రక్షితార్తగత మార్కండేయు నేఁ గొల్చెదన్

100.                                                                                                                                            

 

 

 

శా.

లీలా లీలను ద్రాగితే విషము శూలీ కాలకంఠేశ్వరా

కాలక్లేశము మాన్పితే శశికి భర్గా చంద్రమౌళీశ్వరా

బాలా రత్నము నుంచితే తనువునన్ వామార్ధ నారీశ్వరా

ఫాలాక్షా! ప్రమథాధిపా! పురహరా! పాలించు నందీశ్వరా!                                                                                              

101.  

 

 

 

ఉ.

పుట్టితి కార యందు నిజ మూర్తి ధరించి వచించి కార్యమున్

మెట్టితి మంద గుప్తముగ మీఱి చెలంగితి బాల్య లీలలన్

గుట్టుగఁ జంపి తాసురుల గోత్రము నెత్తితి ప్రోచి తందఱిన్

గట్టి ధరా భర మ్మణఁచి కాచితి ధర్మము కృష్ణ! మన్నతుల్

102.                                                                                                                                            

 

 

 

శా.

సౌఖ్యానంద విధాయ కాఘ ఘన వృక్షచ్ఛేద నిర్ఘాతమా!

ప్రఖ్యా తాసుర దైత్య దానవ గణ ధ్వంసార్థ సంజాతకా!

యాఖ్యానేక సుహృజ్జనావన కృ పాయత్తారవిం దాయ తా

క్షా! ఖ్యాతిస్ఫుట కార్య కాయ సువిరాట్కాయా! ముకుందా! నతుల్                                                                                              

103.                                                                                                                                            

 

 

 

ఉ.

తుల్యము లేదు నీ దయకుఁ దోయజ లోచన మెప్పువొంద సా

కల్యము భక్తి నుంచి మదిఁ గైగవ మోడ్పఁ దొలంగుఁ జిత్త వై

కల్యము నామ కీర్తనము గారవ మొప్పఁగఁ జేసి నంతఁ గై

వల్యము నిత్తు వీ విల  కృపారస సాగర! శ్రీధరా! నతుల్

104.                                                                                                                                            

 

 

 

ఉ.

దాశరథుండు రాఘవుఁడు ధార్మిక లోక వరేణ్య వర్యుఁ డౌ

యీశుఁడు నిత్య సత్య రతుఁ డిద్ధ చరిత్రుఁడు జానకీ మనః

పాశ నిబద్ధుఁ డర్క కుల వారిధి పూర్ణ శశాంకుఁ డుగ్ర దై

త్యేశ దశాననఘ్నుఁడు మహీ వలయమ్మును బ్రోచుఁ గావుతన్                                                                                               

105.                                                                                                                                            

 

 

 

శ్రీమన్నారాయణ  దండకము.

శ్రీవత్స వక్షో విరాడాది లక్ష్మీ! పదాంభోజ సందీప్త మందాకినీ! శార్ఙ్గ కౌమోదకీ చక్ర నిస్త్రింశ శంఖాది దివ్యాయు ధానీక హస్తాబ్జ గంభీర శుభ్రాభ్ర  మేఘాభ నీలాంగ నిశ్చేష్టి తాలోక లోకాలి  తప్తాభ్ర కోటీర కేయూర కర్ణాంక దివ్యప్రభా సోజ్జ్వలత్కౌస్తు భోపేత హారాలి మంజీర కాంచీ కనత్కంక ణాబంధ కౌశేయ పీతాంబ రానంద చిద్రూప! చిత్తమ్ము నందుంచి నింగొల్తు నిత్యమ్ము సద్భక్తిఁ గల్పంపు టంతమ్ము నందెల్ల లోకమ్ము లంభోధి మున్గంగ ధ్వాంతమ్ము నిండంగ నీకుక్షి లోనుండ విశ్వమ్ము సూక్ష్మంబుగా నుండి రక్తంపు వర్ణంపు నీ కాలి వ్రేలుండ నీ నోటిలో నిండి చిత్రమ్ముగా మఱ్ఱి పత్రమ్ముపైఁ గ్రీడ నీ వాడు చుండంగ నా లీల వర్ణింప శక్యమ్మె వేదమ్ము లింపార దుర్దాంత మత్స్యంబవై సోమకుం దోయ సంచారకుం జంపి రక్షించితే, భీమ శైలాభ కూర్మంబవై తాల్చితే మంథమున్ శైల రాజేంద్రమున్, దంష్ట్ర భీభత్స సుశ్వేత కోలంబవై త్రుంచి యంభోధిఁ గ్రూరున్ హిరణ్యాక్షు లోలాక్షు భూదేవిఁ గాపాడితే, సందె వేళన్ నృసింహుండవై యుగ్ర రూపమ్మునం జంపితే దైత్య నాథున్ హిరణ్యాశనున్ భగ్న నీచాశునిన్, వామ నాకారముం బూని  దైత్యేంద్రు వైరోచనున్  సమ్యగాలోచనుం  ద్రొక్కితే, భార్గ వామ్నాయ రాముండవై రాజలోకమ్ము గర్వాంధ తోత్తీర్ణ నాకమ్ము నిశ్శేషముం జేసితే, వీర కోదండ రాముండవై చంపితే రావణున్ లోక విద్రావణున్, రామ నాముండవై శౌరివై భూమి భారమ్ము నస్తోక భారమ్ము విచ్ఛేదముం జేసితే, బుద్ధ దేవుండవై మాన వోద్ధారముం దుల్య మందారముం జేసితే, నీవ కృష్ణుండు విష్ణుండవే కల్కి నా నింక రా నుంటివే ధర్మ రక్షార్థమై నాథ! కృష్ణుండు నా మీఱి గోపార్భ సంఘాత విధ్వంస దుష్పూతనా స్తన్యముం గ్రోలి ప్రాణమ్ములం దీసి, పెన్బండినిం దన్ని,  యాకాశ వీథిం దృణావర్తునిం గూల్చి, మన్నేల భక్షించితే యన్న నీ నోటనుం జూపితే మాతకున్ విశ్వ సందోహమున్, మద్దెలం గూల్చితే, వత్స రూపంపు ఘోరాసురుం జంపితే, వ్యాజ వేషున్ బకోటాసురుం జంపితే, భీక రాఘాసురుం జంపితే పద్మసంజాతు దర్పమ్మునుం ద్రుంచితే, కాళియుం డుండఁ గాళింది మర్దించితే, ఘోర దావాగ్ని వే మ్రింగితే, లీల గోవర్ధనం బెత్తి దేవేంద్రు గర్వమ్ము వో గొట్టితే, నందు శ్రద్ధావతిం జేరి తోడ్తెచ్చితే, వల్లవీ కాంతలన్ రాస లీలాదులం దన్పితే, శంఖచూ డాఖ్యునిం ద్రుంచితే, సౌర భారిష్టునిం జంపితే, కేశి నామాశ్వకవ్యోమ దైత్యోగ్రులం జంపితే, చాకలిం జంపితే, కుంజరక్రూరు భంజించితే, మల్ల చాణూరునిం జంపితే, మామ కంసున్ ధరా బాల హింసున్ దురాత్మున్ సులీలం దెగంజూచితే తల్లికిం దండ్రికిం గార మాన్పించి పూజించితే తాతకుం బట్టముం గట్టితే కుబ్జ కా వక్రముం బాపి పుత్రుం బ్రసాదించితే, రుక్మిణీ దేవితో నష్ట సద్భార్యలం బొందితే యింక నష్టద్వయమ్ముల్ సహస్రమ్ములున్ భార్యలం బొందితే యేక కాలమ్ము నందుం బ్రకాశించితే వారి సౌధమ్ము లందుండి నిత్యారియౌ దామఘోషుం దదాత్మీయుఁ డౌ  దంత వక్త్రాఖ్యునిం జంపి జన్మత్రయాంతమ్ము వారిద్దఱిం జక్క వైకుంఠ లోకమ్ము నన్నిల్పితే శుద్ధ గీతా పరిజ్ఞాన మందించి రక్షించితే పార్థు నీమాయ నే మందు విశ్వేశ! చండప్రచం డాంశు సాహస్ర భానుండు పేయూష సాదృశ్య శీతాంశు చంద్రుండు నీ నేత్ర చిత్తమ్ములై యుండ, మున్నీరు మామయ్యె, భూమాత యర్ధాంగి, కంజుండు పుత్రుండు, నీశుం డభేదుండు, నీవుందు వన్నింట నిక్షిప్తమై వింత, నీ లేని లేశంబు శూన్యంబ కాంచంగ, క్షీరాబ్ధిఁ దాఁ బుట్టి శ్రీలక్ష్మి కాకుత్స్థుఁ డీ వైన వైదేహి తానయ్యె, శ్రీకృష్ణుఁ డీ వైన వైదర్భి తానయ్యె, లోకాల నేలంగ నిత్యమ్ము నీవుండఁ  జేదోడు వాదోడు తానయ్యె నెన్నండు, నాతల్లితోఁ గూడి దేవాది దేవా చిదానంద సమ్మోహ నోత్సేధ! పద్మాక్ష! మూర్తిత్ర యైకైక భావమ్ము నీయంద వర్ధిల్ల నిన్నెంచ లేరన్న శేషాహి వాగీశ గౌరీశ దేవేంద్రు లింతైన నే నెంత నీపాద దాసుండ నీ దాస దాసుండ నా మోహముం ద్రుంచి, నీభక్తినిం బెంచి, నన్నేలు నిత్యమ్ము, నిం దక్క నేనేర నిం కెవ్వరిన్నాదు చిత్తమ్మునన్ దేవ! నామాంత రోద్భాస నామాలి భూలోక వాసౌఘ సిద్ధౌఘ సాధ్యౌఘ యక్షోర గాశ్వాంగ నీడోద్భ వానీక విద్యాధ రాదిత్య గంధర్వ మున్యోఘ దేవాది సంపూజి తాంఘ్రిద్వయా! దైత్య సందోహ విధ్వంసకా! దుష్ట సంహారకా! శిష్ట రక్షైక దీక్షాగ్ర గణ్యా! దయాసింధు! సాక్షాద్విరాడ్రూప! వైకుంఠ సద్వాస! లక్ష్మీశ! నిన్నెంచి నే మ్రొక్కెదన్ మ్రొక్కెదన్ మ్రొక్కెదన్.  

106.                                                                                                                                            


 

 

 

 

 

 

 

 

 

దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక.

గ్రంథ కర్తృ దంపతులు

 

 

వివరములు:

పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design)

స్వగ్రామము:

బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ఉద్యోగము:

  1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), Hyderabad.
  2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad.
  3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of  Engineering and Technology,  Raipur.

నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013  

              Cell. Nos. 8602787525, 9440378434.

 

స్వీయ రచనలు:

1.      రామ చంద్ర శతకము.

2.      పోచిరాజ శతకము.

3.      పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు).

4.      వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము).

5.      శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు).

6.      శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము).

7.      శ్రీమన్నారాయణ శతకము.

8.      శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు).

9.      శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక.

10.   మాహేశ్వర దండకము.

11.   మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక.

12.   ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుఁడు

13.   శ్రీమదాంధ్ర రామాయణము.  

14.   శ్రీ బాల రామాయణము (సంక్షిప్త రామాయణము)  (కొనసాగుచున్నది)

15.   గోవిందము.